5జీ స్పెక్ట్రమ్ కోసం అదానీ గ్రూప్ దరఖాస్తు ?

5జీ స్పెక్ట్రమ్ కోసం అదానీ గ్రూప్ దరఖాస్తు ?

5జీ స్పెక్ట్రమ్ రేసులో  కోసం అదానీ గ్రూప్ ఉందా ? అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించగల 5జీ ఇంటర్నెట్, టెలికాం సేవల్లోకి ప్రవేశించాలని ఆ కంపెనీ యోచిస్తోందా ? అంటే.. దీనికి  ఔననే సమాధానమే ఇచ్చేలా మీడియాలో కథనాలు వస్తున్నాయి. టెలికాం కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్ ను కేటాయించేందుకు సంబంధించిన వేలంపాట జులై 26న ప్రారంభం కాబోతోంది. 5జీ స్పెక్ట్రమ్ దరఖాస్తు గడువు జులై 8తో ముగిసింది. దీనికి దరఖాస్తులు సమర్పించిన కంపెనీల జాబితాలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పేర్లు ఉన్నాయి. ఆ లిస్టులోని నాలుగో పేరు ‘అదానీ గ్రూప్’నకు చెందిన ఓ సంస్థదే అంటూ అంచనాలు వెలువడుతున్నాయి.  అయితే దీనిపై అదానీ గ్రూప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

జులై 12న తెలిసిపోతుంది 

ఇటీవల అదానీ గ్రూప్..  నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్డీ) లైసెన్సులను కూడా పొందింది. అయితే దీనిపైనా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ 5 జీ స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసిన కంపెనీల పేర్లు తెలియాలంటే జులై 12 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజున బిడ్డింగ్ సమర్పించిన కంపెనీల వివరాలను వెల్లడించనున్నారు. 

 ‘ప్రైవేట్ క్యాప్టివ్ నెట్ వర్క్’ వ్యాపారం..

5 జీ స్పెక్ట్రమ్ తో ‘ప్రైవేట్ క్యాప్టివ్ నెట్ వర్క్’ ను అదానీ గ్రూప్  ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని కంపెనీలకు ప్రైవేటు క్యాప్టివ్ నెట్ వర్క్ లను తయారుచేసి అందించే సేవలకు శ్రీకారం చుట్టే చాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ టెలికాం సేవల రంగంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టాలని అదానీ భావిస్తే.. యూనిఫైడ్ లైసెన్సును తీసుకుంటారని చెబుతున్నారు. దేశవ్యాప్త యూనిఫైడ్ లైసెన్సు కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.15 కోట్ల లైసెన్సింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 

5జీ కేటాయించిన తర్వాత.. 

5 జీ స్పెక్ట్రమ్ ను పొందే కంపెనీలు దాన్ని 20 ఏళ్లపాటు వినియోగించుకునే హక్కులను సొంతం చేసుకుంటాయి.  5జీ స్పెక్ట్రమ్ ను వేలంలో ఎంత మొత్తానికైతే కంపెనీలు దక్కించుకుంటాయో.. ఆ మొత్తాన్ని 20 ఈఎంఐలలో, 20 ఏళ్ల పాటు చెల్లించే వెసులుబాటును కల్పిస్తారు. ప్రతి ఏడాది తొలి త్రైమాసికంలోగా కేంద్ర ప్రభుత్వానికి ఈఎంఐ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్ ను వినియోగించే ఆసక్తి లేని కంపెనీలు దాన్ని.. పదేళ్ల తర్వాత బకాయి ఈఎంఐలతో పాటు ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు. 

5జీలో ఫ్రీక్వెన్సీలు.. 

దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగా హెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ను కేంద్ర ప్రభుత్వం వేలం వేయనుంది. 5జీ స్పెక్ట్రమ్ లోని ‘లో ఫ్రీక్వెన్సీ’ రేంజ్   పరిధిలో 600 మెగా హెర్జ్ట్, 700 మెగా హెర్జ్ట్, 800 మెగా హెర్జ్ట్, 900 మెగా హెర్జ్ట్, 1800 మెగా హెర్జ్ట్, 2100 మెగా హెర్జ్ట్, 2300 మెగా హెర్జ్ట్ బ్యాండ్ లు ఉంటాయి. ‘మిడ్ ఫ్రీక్వెన్సీ’ 5జీ స్పెక్ట్రమ్  పరిధిలో 3300 మెగా హెర్జ్ట్ బ్యాండ్ ఉంటుంది.  ‘హై ఫ్రీక్వెన్సీ’ 5జీ స్పెక్ట్రమ్  పరిధిలో 26 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుంది.