అర్హులందరికీ రుణమాఫీ:నిరంజన్రెడ్డి

అర్హులందరికీ రుణమాఫీ:నిరంజన్రెడ్డి
  • అకౌంట్ క్లోజ్ లేదా బ్లాక్ అయినవాళ్లకూ మాఫీ సొమ్ము  
  • రైతులు ఆందోళన చెందొద్దు: నిరంజన్రెడ్డి   
  • ఇప్పటిదాకా 16.65 లక్షల మంది రైతులకు రూ.8వేల కోట్లు జమ

హైదరాబాద్, వెలుగు: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిన లేదా బ్లాక్ అయిన రైతులకు కూడా వారి ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము డిపాజిట్ చేస్తామన్నారు. 

2018 డిసెంబర్ 11 నాటికి క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్న మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు రుణమాఫీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

‘‘బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయినా, అకౌంట్ నంబరు మారినా రుణమాఫీ కావాల్సిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్తంభించిన ఖాతాలు, డీబీటీ ఫెయిల్ అయిన ఖాతాలు ఉన్న రైతులు కూడా క్రాప్ లోన్ మొత్తాన్ని అందుకుంటారు” అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం16,65,656 మంది రైతుల ఖాతాలకు రూ.8,089.74 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
 
రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల డేటాబేస్ 2020లో తయారు చేశామని, బ్యాంకుల విలీనం వల్ల రైతుల ఖాతాల వివరాలు మారడంతో  కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. అప్పటినుంచి ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్‌లను అప్‌డేట్ చేయడానికి బ్యాంకర్లకు 3 సార్లు డేటా ఇచ్చామన్నారు.