చిన్నారి పోరాటం చూసి ఆనంద్ మహింద్రా కంటతడి

చిన్నారి పోరాటం చూసి ఆనంద్ మహింద్రా కంటతడి

చిన్న చిన్న బాధలకే ఎంత కష్టాన్నిచ్చావు దేవుడా..! అని నిరాశపడిపోతారు కొందరు. అన్నీ బాగున్నా ఏ చిన్న ఇబ్బందికో ఛీ ఇదేం జీవితం అంటూ డీలా పడిపోతారు మరికొందరు.

ఈ చిన్నారిని చూస్తే ఎటువంటి వారికైనా జీవితంపై కొత్త ఆశలు పుట్టకమానవు. ఎంత కిందికి పడినా మళ్లే లేచి పరిగెత్తొచ్చనే ధీమా వస్తుందేమో!

ఆకలిని ఓడించాలని పట్టు

ఈ చిన్నారి పేరు వాసిలినా క్నుట్జెన్. రష్యాకు చెందిన ఈ పాపకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. ఆ పసితనంలో తనంతట తానే ఆహారం తీసుకునేందుకు ఒక పోరాటమే చేస్తోంది. కాలి వేళ్ల మధ్యలో ఫోర్క్ పెట్టుకుని ఫుడ్ తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తోంది. తొలి ప్రయత్నంలో నోటికి అందకున్నా ఏ మాత్రం నిరాశ, చిరాకు పడలేదు. విధిని ఎదిరించి.. ఆకలితో పోరాటంలో గెలిచింది. చిరునవ్వు ముఖంతోనే మళ్లీ ఇంకోలా ఆహారాన్ని అందుకుంది. ఈ పసిపాప ఇబ్బందిని చూసి ఎవరికైనా కళ్లు చమర్చక మానవు. ఆ ప్రయత్నం ఎంతటి నిరాశావాదిలోనైనా ఆశలు చిగురింప చేస్తుంది.

ఆనంద్ మహింద్రా కంటతడి

ఈ వీడియో మిత్రుల ద్వారా వాట్సాప్ లో వ్యాపార దిగ్గజం ఆనంద్ మహింద్రాకు చేరింది. ఇటీవల తరచూ తన మనవడితో ఆడుకుంటూ గడుపుతున్న ఆయనకు ఆ చిన్నారి పరిస్థితి చూసి కళ్లు చమర్చాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

‘‘జీవితం ఏమిచ్చినా ఒక గిఫ్టులా స్వీకరించాలి. ఎటువంటి లోపాలు, సవాళ్లను అయినా సరే మనం ఎలా మలుచుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది’’ అని అన్నారాయన.