PNB చేతికి  ఆంధ్రాబ్యాంకు

PNB చేతికి  ఆంధ్రాబ్యాంకు

మరోసారి బ్యాంకుల ఏకీకరణకు రంగం సిద్ధమవుతోంది. ఇది వరకే బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బరోడా, దేనా బ్యాంక్‌‌‌‌, విజయ బ్యాంకులను విలీనం చేసిన కేంద్రం ప్రభుత్వం ఇక పంజాబ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ (PNB) లో ఓరియంటల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌, ఆంధ్రా బ్యాంక్‌‌‌‌, అలహాబాద్‌‌‌‌లను కలిపేయాలని భావిస్తోంది. జాతీయ మీడియాలో మంగళవారం ఈ మేరకు పలు కథనాలు వచ్చాయి. వీటి ప్రకారం.. రాబోయే మూడు నెలల్లో పీఎన్బీ ఈ మూడు బ్యాంకులను విలీనం చేసుకుంటుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న బ్యాంకింగ్‌‌‌‌ రంగాన్ని కుదించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించడం తెలిసిందే. కొన్ని నెలల క్రితం దేనా బ్యాంక్‌‌‌‌, విజయ బ్యాంక్‌‌‌‌, బ్యాంక్‌‌‌‌ బరోడాలను విలీనం చేశారు.  అంతకుముందు ఎస్‌‌‌‌బీఐ తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రభుత్వరంగ సంస్థ లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఎల్‌‌‌‌ఐసీ) మరో ప్రభుత్వరంగ బ్యాంకు ఐడీబీఐలో మెజారిటీ వాటాలు కొన్నది. మొండిబకాయిలతో సతమతమవుతున్న ఐడీబీఐ ఎల్‌‌‌‌ఐసీ చేతుల్లోకి వెళ్లడం వల్ల అదనంగా మూలధనం సమకూరుతుందని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 2017లో ఎస్‌‌‌‌బీఐ భారతీయ మహిళా బ్యాంకు సహా మరో ఐదు బ్యాంకులను విలీనం చేసుకుంది. ఫలితంగా ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో మంగళవారం పీఎన్బీ షేర్లు నాలుగుశాతం నష్టపోయాయి. నిఫ్టీలో ఇవి 2.55 శాతం తగ్గి రూ.86.10 వద్ద ముగిశాయి. అలహాబాద్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ షేర్లు 2.6 శాతం నష్టపోయి రూ.45.15లకు చేరాయి. ఓరియెంటల్ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌ ఒకశాతం నష్టపోవడంతో షేరు ధర రూ.95.20లకు చేరింది.

బీఓబీ, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌‌‌‌ల ఇంటిగ్రేషన్‌‌‌‌ రెండేళ్లలో పూర్తవుతోందని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) అధికారులు చెప్పారు. బీఓబీ, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌‌‌‌ల విలీనం ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది.  ఈ బ్యాంక్‌‌‌‌ల ఇన్‌‌‌‌ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఇంటిగ్రేషన్‌‌‌‌కే 12 నెలల మేర సమయం పట్టే అవకాశాలున్నాయని బీఓబీ సీనియర్ అధికారులు అంచనా వేశారు. మరో ఏడాది ఇతర ప్రక్రియలకు, సిస్టమ్స్‌‌‌‌కు పడుతుందని పేర్కొన్నారు. తాత్కాలిక కాలానికి ఈ మూడు సంస్థలు తమ బ్రాండింగ్‌‌‌‌నే కొనసాగించనున్నాయి. ప్రస్తుత కార్యకలాపాలకు అవాంతరాలను కాస్త తగ్గిస్తూ.. క్రమక్రమంగా వీటిని కొత్త బ్రాండ్‌‌‌‌లోకి మార్చనున్నామని అధికారులు చెప్పారు. క్యాపిటల్ పరంగా చూస్తే.. బ్యాంక్‌‌‌‌కు అయ్యే అదనపు ఖర్చులు, కనీస నియంత్రణ మూలధన అవసరాల కోసం ప్రభుత్వం రూ.5,042 కోట్లను  ఇచ్చిందని పేర్కొన్నారు. తొలి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్‌‌‌‌ బ్యాలెన్స్ షీటుపై ఒత్తిడి ఉంటుందని, ఆ తర్వాత క్రమక్రమంగా దాని ప్రభావం తగ్గుతుందని అధికారులు చెప్పారు.

విలీనం వల్ల ఎన్నో ప్రయోజనాలు: ప్రభుత్వం

విలీనం కారణంగా ఎస్‌‌‌‌బీఐ తర్వాత దేశీయంగా రెండో అతిపెద్ద బ్యాంక్‌‌‌‌గా బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బరోడా అవతరించింది. మొదటిస్థానంలోని ఎస్‌‌‌‌బీఐ 9500కు పైగా బ్రాంచులు, 13,400 ఏటీఎంలు, 85వేల మంది ఉద్యోగులతో 12 కోట్ల మంది కస్టమర్లకు ఇది సేవలందిస్తోంది. విలీనం వల్ల వాటాదారులందరికీ గణనీయమైన ప్రయోజనం చేకూరనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.  విలీనంతో బీఓబీ వ్యాపార విలువ రూ.15 లక్షల కోట్లను దాటింది.  డిపాజిట్లు రూ.8.75 లక్షల కోట్లకు, అడ్వాన్స్‌‌‌‌లు రూ.6.25 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌‌‌లను ఆరోగ్యకరమైనవిగా, గ్లోబల్‌‌‌‌గా స్థాయికి తగ్గట్టు తీర్చిదిద్దడానికి కేంద్రం పలు సంస్కరణలను అమలు చేస్తున్నది.  సంస్కరణల ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం ఐడీబీఐలో ఉన్న 51 శాతం మెజార్టీ వాటాలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌‌‌కు అమ్మేసింది.   2018–-19 కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌‌‌‌బీలు) రికార్డు స్థాయిలో రూ.1.06 లక్షల కోట్లను అందించింది. దీని ఫలితంగా ఐదు పీఎస్‌‌‌‌బీలు బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌‌‌‌లు ఆర్‌‌‌‌బీఐ పీసీఏ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ నుంచి బయటికి వచ్చాయి. ఎన్‌‌‌‌పీఏలు మాత్రం నెగిటివ్‌‌‌‌ ట్రెండ్‌‌‌‌లోనే ఉన్నాయి. 2018 ఏప్రిల్ నుంచి 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో ఇవి రూ.23,860 కోట్లు తగ్గాయి. పీఎన్బీ విలీనం పూర్తయితే పీఎస్‌‌‌‌బీల సంఖ్య కూడా 15కు చేరుతుంది.