మమతకు మరో షాక్‌‌.. రాజ్యసభ ఎంపీ రాజీనామా

మమతకు మరో షాక్‌‌.. రాజ్యసభ ఎంపీ రాజీనామా

రాజ్యసభలోనే ప్రకటించిన దినేశ్ త్రివేది
బెంగాల్ లో హింస జరుగుతోందని ఆరోపణ

కోల్ కతా: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌‌ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ దినేశ్ త్రివేది ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలోనే ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘‘బెంగాల్ లో హింస పెరుగుతోంది. దీని వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. అలాంటి పరిస్థితుల్లో నేనిక్కడ కూర్చోవడం చాలా వింతగా అనిపిస్తోంది. నేనేం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏమీ చేయకుండా, ఏమీ మాట్లాడకుండా ఉండడం కంటే.. రాజీనామా చేయడమే మంచిదని నా అంతరాత్మ చెబుతోంది. అందుకే రాజీనామా చేస్తున్నాను” అని దినేశ్ భావోద్వేగంతో చెప్పారు. ‘‘మాతృభూమికి సేవ చేసేందుకు మేం ఇక్కడ ఉన్నాం. నన్ను ఇక్కడికి పంపినందుకు పార్టీకి కృతజ్ఞతలు” అని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ కోసం పని చేస్తున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పైనా త్రివేది విమర్శలు చేశారు. ‘‘పార్టీ కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. పాలిటిక్స్ తెలియనోళ్లు పార్టీని నడిపిస్తున్నారు” అని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి అయిన త్రివేది.. రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. కాగా, ఇప్పటి వరకు నలుగురు సీనియర్ లీడర్లు టీఎంసీకి గుడ్ బై చెప్పారు.

టీఎంసీ ఫైర్..

త్రివేది రాజీనామాపై టీఎంసీ మండిపడింది. ఆయనకు పార్టీపై కృతజ్ఞతా భావం లేదని ఫైర్ అయింది. ‘‘గత కొన్నేండ్లుగా ఆయనేం చెప్పలేదు. సడెన్ గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఫిర్యాదులు చేశారు. దీన్ని బట్టే ఆయన అసలు రూపమేంటో తెలుస్తోంది” అని టీఎంసీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు.

పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ…

త్రివేది రాజీనామాపై బీజేపీ స్పందించింది. టీఎంసీ పతనం మొదలైందని కామెంట్ చేసింది. ‘‘త్వరలోనే టీఎంసీ విచ్ఛిన్నం అవుతుంది. త్రివేది మా పార్టీలో చేరాలనుకుంటే, ఆయనను స్వాగతిస్తున్నాం” అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ చెప్పారు.