తొలి రోజే ఇండియాకు ఐదు మెడల్స్‌

తొలి రోజే ఇండియాకు ఐదు మెడల్స్‌

దోహా: ఆసియా షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా షూటర్ల గన్‌‌ గర్జించింది. పోటీల తొలి రోజే ఇండియాకు రెండు స్వర్ణాలు సహా ఐదు పతకాలు లభించాయి. యువ షూటర్‌‌ మనూ భాకర్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరవగా… బర్త్‌‌డే బాయ్‌‌ దీపక్‌‌ కుమార్‌‌ తనకు తానే అద్భుతమైన గిఫ్ట్‌‌ ఇచ్చుకున్నాడు.  కాంస్యంతో పాటు ఒలింపిక్‌‌ బెర్త్‌‌ దక్కించుకున్నాడు. దాంతో, టోక్యో ఒలింపిక్స్‌‌ షూటింగ్‌‌లో ఇండియా బెర్తుల సంఖ్య పదికి చేరింది. మంగళవారం జరిగిన  మహిళల పది మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ ఫైనల్లో 17 ఏళ్ల మను 244.3 స్కోరుతో స్వర్ణం నెగ్గింది. మేలో జరిగిన మ్యూనిక్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లోనే ఆమె ఒలింపిక్‌‌ బెర్త్‌‌ దక్కించుకుంది. ఇదే విభాగంలో పోటీ పడ్డ యశస్విని సింగ్‌‌ ఆరో స్థానంలో నిలవగా.. అన్ను రాజ్‌‌ సింగ్‌‌ 20వ ప్లేస్‌‌తో సరిపెట్టింది. టీమ్‌‌ ఈవెంట్‌‌లో మను, యశస్విని, అన్ను రాజ్‌‌తో కూడిన ఇండియా టీమ్‌‌ 1731 స్కోరుతో కాంస్యం గెలిచింది. అంతకుముందు  పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌‌ ఫైనల్లో దీపక్‌‌ కుమార్‌‌ 227.8 పాయింట్లతో కాంస్య పతకం గెలిచి టోక్యో టికెట్‌‌ కైవసం చేసుకున్నాడు. ఇదే కేటగిరీలో పోటీపడ్డ కిరణ్‌‌ అంకుష్‌‌ జాదవ్‌‌ 14, యశ్‌‌ వర్దన్‌‌ 30వ స్థానాలతో నిరాశ పరిచారు.   జూనియర్‌‌ ట్రాప్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో వివాన్‌‌ కపూర్‌‌, మనీషా కీర్‌‌తో కూడిన ఇండియా గోల్డ్‌‌ నెగ్గింది. ఫైనల్లో ఈ జోడీ 34–29తో చైనాకు చెందిన టింగ్‌‌ జాంగ్‌‌–పెంగ్యూ చెన్‌‌ను ఓడించింది.  ఇక, మహిళల పది మీటర్ల ఎయిర్‌‌ రైఫిల్‌‌ టీమ్‌‌ ఫైనల్లో అంజుమ్‌‌ మౌద్గిల్‌‌, అపూర్వీ చండేలా, ఎలావెనిల్‌‌ వలారియన్‌‌తో కూడిన ఇండియా 1883.2 స్కోరుతో సిల్వర్‌‌ నెగ్గింది.