నిరుటి వడ్లు ఇంకా  మిల్లింగ్‌‌ చేయలె

నిరుటి వడ్లు ఇంకా  మిల్లింగ్‌‌ చేయలె

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోంది. దీంతో మిల్లర్లు  టైమ్‌‌కు కస్టమ్‌‌  మిల్లింగ్‌‌  రైస్‌‌  (సీఎంఆర్‌‌) ఇవ్వడం లేదు. సర్కారు ఇచ్చిన వడ్లను మిల్లర్లు మిల్లింగ్‌‌  చేసి అమ్ముకుని, సర్కారుకు ఇవ్వడానికి మాత్రం ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు. దీంతో పౌర సరఫరాల శాఖ రూ.వేల కోట్ల అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టడానికి తంటాలు పడాల్సి వస్తోంది. మిల్లర్లు మాత్రం పైసా పెట్టుబడి లేకుండా అక్రమంగా కోట్లు కొల్లగొడుతున్నారు. కొన్ని జిల్లాల్లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా స్థాయి అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవడంతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లలో అక్రమార్కులపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. దీంతో ఏండ్ల తరబడి మిల్లింగ్​లో జాప్యం జరుగుతోంది. నిరుడు వానకాలం, యాసంగి సీజన్‌‌లకు సంబంధించి వడ్లకు ఇప్పటి వరకూ మిల్లింగ్​ పూర్తిచేయలేదు. 

.గత ఏడాది వానకాలంలో మిల్లులకు అప్పగించిన వడ్లు 47.04 లక్షల టన్నుల సీఎంఆర్‌‌ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఏడాదిన్నర అయినా ఇంకా 2.64 లక్షల టన్నుల బియ్యం ఇవ్వలేదు. అంతేకాకుండా నిరుడు యాసంగిలో సేకరించిన వడ్లను మిల్లింగ్​ చేసి 34.07 లక్షల టన్నుల సీఎంఆర్‌‌  ఇవ్వాల్సి  ఉంది. ఇలా నిరుడు అప్పగించిన పాత బియ్యం 12 లక్షల  వరకు ఎఫ్‌‌సీఐకి తిరిగి ఇవ్వాల్సి ఉంది. పాత బియ్యం ఇవ్వడానికి ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. గడువును ప్రతిసారి పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఈసారి మాత్రం పొడిగించేది లేదని స్పష్టం చేసింది. దీంతో గడువులోపు పాత బియ్యం ఇవ్వని మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

5 లక్షల టన్నుల  సీఎంఆర్​ కూడా ఇయ్యలే

2022–23 వానాకాలానికి సంబంధించి రైతుల నుంచి 65.03 లక్షల టన్నుల వడ్లను సివిల్‌‌ సప్లయ్స్‌‌  శాఖ సేకరించింది. ఈ వడ్లను మిల్లింగ్‌‌  చేయించి 43.57 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌  రారైస్‌‌ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు  5 లక్షల టన్నుల సీఎంఆర్‌‌  కూడా మిల్లర్లు మిల్లింగ్‌‌  చేసి ఇవ్వలేదు. ఇంకా 38 లక్షల టన్నులకు పైగా  సీఎంఆర్‌‌  ఇవ్వాలి. మిల్లర్ల నిర్లక్ష్యంతో మిల్లింగ్‌‌ నత్తనడకన కొనసాగుతోంది.