నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్

నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
  • భూమిపై రెండు మూడు రోజులు సూర్యుడి ప్లాస్మా, రేడియేషన్ ఎఫెక్ట్  
  •     లడఖ్​లోని హాన్లే గ్రామంలోనూ రంగుల్లో మెరిసిన ఆకాశం

కేప్ కానవెరాల్ (యూఎస్ఏ):    సూర్యుడు రెండు దశాబ్దాల్లోనే అతి తీవ్రంగా నిప్పులు కక్కాడు. దీంతో భారీ సౌర తుఫాన్ ఏర్పడి, అది భూమిని తాకింది. సూర్యుడిపై బుధవారం పెద్ద ఎత్తున సౌర జ్వాలలు ఎగిసిపడ్డాయని, ప్లాస్మా, రేడియేషన్ అంతరిక్షంలోకి ఎగజిమ్మి సోలార్ స్టార్మ్ గా మారాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) సంస్థలు ప్రకటించాయి. ప్లాస్మా, రేడియేషన్​తో కూడిన సౌర తుఫాన్ శుక్రవారం మధ్యాహ్నం భూమిని తాకినట్టు వెల్లడించాయి. సూర్యుడి ప్లాస్మా, రేడియేషన్ కారణంగా భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, శాటిలైట్లు, పవర్ గ్రిడ్లపై రెండు మూడు రోజులపాటు ప్రభావం పడనుందని హెచ్చరించాయి. భూమి కంటే 17 రెట్ల సైజులో సూర్యుడిపై ఏర్పడిన సన్ స్పాట్ నుంచి ఈ సౌర జ్వాలలు, ప్లాస్మా ఎగిసిపడ్డాయని నాసా తెలిపింది. వరుసగా 7 సార్లు ప్లాస్మా పేలుళ్లు సంభవించాయని, వీటి వల్ల వందల కోట్ల టన్నుల ప్లాస్మా ఎగసిపడిందని పేర్కొంది. ఈ ప్లాస్మా కణాలు సెకనుకు 800 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకువస్తున్నాయని, మొదటి పేలుడుతో ఎగజిమ్మిన ప్లాస్మా కణాలు శుక్రవారం మధ్యాహ్నం భూమిని తాకాయని తెలిపింది.

మనుషులపై నో ఎఫెక్ట్ 

అంతరిక్షంలోని కమ్యూనికేషన్ శాటిలైట్లపై, భూమి మీద ఉన్న పవర్ గ్రిడ్లపై రెండు మూడు రోజుల పాటు సౌర తుఫాన్ ప్రభావం పడవచ్చని నాసా తెలిపింది. కమ్యూనికేషన్ సేవలకు, విద్యుత్ సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చని పేర్కొంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్​లోని ఆస్ట్రోనాట్లకు, భూమిపై ఉన్న మనుషులకు మాత్రం ముప్పు లేదని వెల్లడించింది. కాగా, ఎలాన్ మస్క్​కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్లపై కూడా సోలార్ స్టార్మ్ వల్ల చాలా ప్రెజర్ పడిందని ఆ కంపెనీ ప్రకటించింది. శాటిలైట్లపై రేడియేషన్ ఎఫెక్ట్ కారణంగా తాము అందించే ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం కలగవచ్చని ఎక్స్​లో ప్రకటన విడుదల చేసింది.

లడఖ్​లోనూ అరోరాలు

సౌర తుఫాన్ కారణంగా భూమిని తాకిన ప్లాస్మా, రేడియేషన్ ప్రభావంతో లడఖ్​లోని హాన్లే గ్రామం వద్ద కూడా ఆకాశం ఆకుపచ్చ, ఊదా, ఇతర రంగులతో మెరిసిపోయింది. స్థానికులు, పర్యాటకులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా అవి వైరల్ అయ్యాయి. సౌర తుఫాన్ ప్రభావంతో దక్షిణ అమెరికా సహా, ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్ వరకూ అనేక దేశాల్లో ఆకాశంలో ఆరోరాలు ఏర్పడ్డాయి. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.