T20 World Cup: చరిత్ర తిరగరాసిన భారత్.. టీ20 ఫార్మాట్‎లోనే తొలి జట్టుగా నయా రికార్డ్

T20 World Cup: చరిత్ర తిరగరాసిన భారత్.. టీ20 ఫార్మాట్‎లోనే తొలి జట్టుగా నయా రికార్డ్

టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్ నిలిచింది. 2026, మార్చి 8న గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‎ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‎లో రాణించి ఫైనల్ పోరును ఏకపక్షంగా మార్చి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. 

ఓవరాల్‎గా మూడుసార్లు (2007, 2024, 2026) టీ20 వరల్డ్ కప్‎ను టీమిండియా ముద్దాడింది. ఈ విజయంతో టీమిండియా పలు రికార్డులు నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్‎కు అతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే.. వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా కూడా ఇండియా రేర్ ఫీట్ నెలకొల్పింది.  

గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) రాణించారు. చివర్లో శివమ్ దూబే 8 బంతుల్లో 26 రన్స్ చేసి మెరుపు ఫినింగ్ ఇచ్చాడు. 

న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3 వికెట్లు సాధించాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే చాపచుట్టేసింది. ఆది నుంచి భారత బౌలర్లు బెంబేలెత్తించడంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ ఛేధన వైపు సాగలేదు. 

న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ సీఫెర్ట్ ఒక్కడే హాఫ్ సెంచరీతో (52) ప్రతిఘటించాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 43 పోరాడాడు. మిలిగిన బ్యాటర్లంతా చేతులేత్తేయడంతో వరల్డ్ కప్‎కు అడుగు దూరంలోనే న్యూజిలాండ్ బోల్తా కొట్టింది.