హాస్పిటల్స్ ఏం పాపం చేశాయని.. ఇరాన్లో 25 హాస్పిటల్స్పై బాంబులు వేసిన ఇజ్రాయెల్

హాస్పిటల్స్ ఏం పాపం చేశాయని.. ఇరాన్లో 25 హాస్పిటల్స్పై బాంబులు వేసిన ఇజ్రాయెల్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో వేల మంది అమాయకులు చనిపోతున్నారు. ఆ దేశాల్లో పుట్టిన పాపానికి సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ బయటపెట్టిన డేటానే ఇందుకు సాక్ష్యం. ఇరాన్ యుద్ధం మొదలై సోమవారానికి (మార్చి 9, 2026) పది రోజులైంది. ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎనిమిదో రోజుకు చేరే సమయానికి దాదాపు 12 వందల మంది ఇరాన్ పౌరులు చనిపోయారు. దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

ఇజ్రాయెల్-అమెరికా కలిసి ఇరాన్పై చేసిన స్ట్రైక్స్లో 25 హాస్పిటల్స్ దెబ్బతిన్నాయి. వీటిల్లో ఎనిమిది హాస్పిటల్స్ పూర్తిగా దెబ్బతిని వైద్య సేవలు అందించలేని స్థితిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. 18 ప్రీ-హాస్పిటల్ ఎమర్జెన్సీ బేస్లు, 14 అంబులెన్స్లు కూడా ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇవి కాకుండా.. రెండు కౌంటీ హెల్త్ సెంటర్స్, 17 హెల్త్ సర్వీస్ సెంటర్లు, రెండు రూరల్ హెల్త్ సెంటర్లు దాడుల్లో డ్యామేజ్ అయినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. దేశ పౌరులు, దేశ వారసత్వ సంపద ఎప్పటికీ యుద్ధ లక్ష్యం కాకూడదని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ అభిప్రాయపడ్డారు.

ALSO READ : ఆ రెండు దేశాల్లో కరోనా నాటి పరిస్థితులు..

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో మరణాల సంఖ్య 2,400 దాటినట్టుగా మానవ హక్కుల సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులో మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలో మరణించిన 170 మంది విద్యార్థినులు కూడా ఉన్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 394 మంది మరణించగా, అందులో 83 మంది పిల్లలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 14 మంది పౌరులు, సైనికులు మరణించారు. కువైట్ స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఇదివరకే ఏడుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం బహ్రెయిన్లోని అమెరికన్ బేస్పై ఇరాన్ చేసిన దాడిలో ఏకంగా 21 మంది అమెరికన్ సోల్జర్లు మృతిచెందారు. దీంతో ఈ యుద్ధంలో చనిపోయిన అమెరికన్ సోల్జర్ల సంఖ్య 28కి పెరిగింది.