అమెరికా- ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు.. ఇవాళ (జూన్ 30) దోహాలో కీలక భేటీ

అమెరికా- ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు.. ఇవాళ (జూన్ 30) దోహాలో కీలక భేటీ

దోహా: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా రెండు దేశాల మధ్య మళ్లీ శాంతి ప్రయత్నాలు మొదలయ్యాయి. గతవారంలో పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినా, సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపి చర్చల ద్వారా ముందుకు వెళ్లాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరగనుంది.

 ఇదే సమయంలో ఖతార్‌‌‌‌లో ఫ్రీజ్ అయిన ఇరాన్‌‌‌‌కు చెందిన 12 బిలియన్ డాలర్లలో 6 బిలియన్ డాలర్లు విడుదల అవుతాయని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రకటించారు. అయితే ఈ నిధుల విడుదలపై అమెరికా, ఖతార్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పెజెష్కియన్ సోమవారం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాత్కాలిక ఒప్పందాన్ని ‘ఇరాన్ ప్రజల గొప్ప విజయం’గా పేర్కొన్నారు. 

ఖతార్‌‌‌‌లో నిలిచిపోయిన మొత్తం 12 బిలియన్ డాలర్లలో సగం 6 బిలియన్ డాలర్లు విడుదలవుతాయని, దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే డబ్బు ఎప్పుడు, ఏ విధంగా విడుదల అవుతుందో వివరించలేదు. అయితే అమెరికా అధికారులు మాత్రం ఇప్పటివరకు ఒక్క డాలర్ కూడా విడుదల కాలేదని చెబుతున్నారు.

సోషల్​ మీడియాలో ట్రంప్​ ప్రకటన

‘‘ఇరాన్ చర్చలు కోరింది, మంగళవారం దోహాలో సమావేశం జరుగుతుంది’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. వైట్‌‌‌‌హౌస్ కూడా అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌‌‌‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొంది. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఇప్పటివరకు అలాంటి సమావేశం ఖరారు కాలేదని, సాంకేతిక చర్చల షెడ్యూల్‌‌‌‌పై ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు. 

ఇది ఇరు దేశాల ప్రకటనల్లో తేడాను స్పష్టం చేస్తోంది. హార్మూజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరాన్, అమెరికా పరపస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ పరిణామాల తర్వాత పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఇరు దేశాలు ‘ప్రస్తుతం సైనిక చర్యలు నిలిపివేద్దాం’ అనే నిర్ణయానికి వచ్చినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.