2028 నుంచి పెట్రోల్ బైక్‌‌‌‌ల రిజిస్ట్రేషన్లు బంద్..

2028 నుంచి పెట్రోల్ బైక్‌‌‌‌ల రిజిస్ట్రేషన్లు బంద్..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ బైక్‌‌‌‌లు, స్కూటర్లకు కాలం చెల్లనుంది. ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్‌‌‌‌జీ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయనుంది. ఢిల్లీ కేబినెట్ తాజాగా ఆమోదించిన సరికొత్త ఈవీ పాలసీ 2026–2030లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన పాలసీ జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు.

ఈ కొత్త పాలసీ ప్రకారం.. జనవరి 1, 2027 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈవీ వాహనాలను ప్రోత్సహించడానికి  తొలి ఏడాది వాహనదారులకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటించింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ కొనుగోలుదారులకు రూ. 30,000 సబ్సిడీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ కొనుగోలుదారులకు రూ. 50,000 సబ్సిడీ అందించనున్నారు. అయితే, హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీలను ప్రకటించలేదు. ఢిల్లీలో నమోదవుతున్న మొత్తం వాయు కాలుష్యంలో దాదాపు 23 శాతం వాటా వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలదే. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక వసతులు, చార్జింగ్ కేంద్రాల వ్యవస్థను పటిష్టం చేయడమే 
లక్ష్యంగా ఈవీ పాలసీని సర్కారు ఆమోదించింది. ఢిల్లీలో ప్రభుత్వం మొదటగా ఆగస్టు 2020లో మూడేండ్ల కాలపరిమితితో ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. ఆ గడువు ఆగస్టు 2023తో ముగియగా, అప్పటినుంచి దానిని పొడిగిస్తూ వచ్చారు.