టీచర్లకు ఏఐ పాఠాలు... అందుబాటులో ఐదు రకాల కోర్సులు 

టీచర్లకు ఏఐ పాఠాలు... అందుబాటులో ఐదు రకాల కోర్సులు 
  • దీక్ష ప్లాట్‌‌ఫామ్ ద్వారా ఎస్​సీఈఆర్టీ ఆన్‌‌లైన్ శిక్షణ 
  • పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో బోధనా పద్ధతులను మరింత ఆధునికీకరించేందుకు విద్యాశాఖ సరికొత్త అడుగులు వేస్తోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా టీచర్లు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)' కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘దీక్ష’డిజిటల్ ప్లాట్‌‌ఫామ్ ద్వారా టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్​సీఈఆర్టీ ప్రకటించింది. 

ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని ప్రైమరీ, హైస్కూల్ టీచర్లతో పాటు హెడ్మాస్టర్లు కూడా ఉపయోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. టెక్నాలజీపై టీచర్లు అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులకు క్లిష్టమైన సబ్జెక్టులను సైతం చాలా సులభంగా, ఆసక్తికరంగా అర్థమయ్యేలా బోధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

ఐదు విభాగాల్లో శిక్షణ..

టీచర్లు తమ సబ్జెక్టుల బోధనలో ఏఐ టూల్స్‌‌ను ఎలా వాడాలనే అంశంపై ఎస్సీఈఆర్టీ మొత్తం ఐదు రకాల కోర్సులను రూపొందించింది. వీటిలో మొదటిదైన ‘ఏఐ టూల్స్ ఫర్ ఎడ్యుకేషన్’ కోర్సులో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.  ఈ కోర్సు సెప్టెంబర్ 15 నాటికి ముగుస్తుంది. దీంతో పాటు లాంగ్వేజ్ టీచింగ్, సోషల్ సైన్స్, సైన్స్ లెర్నింగ్, మ్యాథమెటికల్ కాంపిటెన్సీ (గణిత నైపుణ్యాలు) వంటి మరో నాలుగు కోర్సులను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేస్తూ శిక్షణ ఇస్తారు. 

ఈ నాలుగు కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వచ్చే ఏడాది 2027 మార్చి 31 వరకు గడువు పొడిగించారు. రాష్ట్రంలోని అర్హులైన టీచర్లు, హెడ్మాస్టర్లు అందరూ ఈ కోర్సుల్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని డీఈవోలకు ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ఆదేశాలు జారీచేశారు.

మొబైల్ యాప్‌‌‌‌లోనే కోర్సులు..

ఈ ఏఐ కోర్సులను టీచర్లు ఖాళీ సమయంలో ల్యాప్‌‌టాప్, డెస్క్‌‌టాప్, స్మార్ట్‌‌ఫోన్‌‌లోని ‘దీక్ష’ మొబైల్ యాప్ ద్వారా సులభంగా పూర్తిచేయవచ్చు. దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'దీక్ష' యాప్‌‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. అనంతరం యాప్‌‌లోని ‘దీక్ష కోర్సెస్’ మెనూలోకి వెళ్లి తమకు కావాల్సిన సబ్జెక్టును ఎంచుకుని పేరు నమోదు చేసుకోవాలి. 

ఈ డిజిటల్ కోర్సుల్లోని వీడియోలు చూసి, లెర్నింగ్ మెటీరియల్ పూర్తిగా చదివిన తర్వాత ఆన్‌‌లైన్‌‌లో ఒక చిన్న పరీక్ష నిర్వహిస్తారు. పాసైన టీచర్లకు విద్యాశాఖ తరఫున సర్టిఫికెట్లను అందజేస్తారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే diksha.telangana2020@gmail.com మెయిల్ ఐడీని లేదా ఎస్సీఈఆర్టీ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.