పెబ్బేరు, వెలుగు : ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో ఓ ఉద్యోగి చనిపోగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులో నేషనల్హైవే 44పై సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు 61 మంది ప్రయాణికులతో సోమవారం ఉదయం మంత్రాలయం నుంచి కర్నూలు మీదుగా వనపర్తికి వస్తోంది.
పెబ్బేరు శివారులోకి రాగానే.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ పై పల్టీ కొట్టింది. ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. ఎస్సై వెంకటేశ్గౌడ్తన టీమ్ తో ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని పెబ్బేరు పీహెచ్ సీకి తరలించారు. ఇదే సమయంలో అటు వైపు అలంపూర్ఎమ్మెల్యే విజయుడు సైతం ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులకు సహాయపడ్డారు.
ప్రమాదంలో కర్నూలుకు చెందిన, మహబూబ్నగర్ఆర్టీసీ డిపోలో డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న నగిరి శివరాం ప్రసాద్ (59) తీవ్రంగా గాయపడడంతో అతడిని హైవే అంబులెన్స్ లో కర్నూలులోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయారు. సమాచారం అందుకున్న డీఎస్పీ గిరిబాబు, సీఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు హాస్పిటల్ కు చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్సై తెలిపారు.
