హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రుతుపవనాలు పుంజుకుంటున్నప్పటికీ అన్ని జిల్లాల్లో సమాన వర్షపాతం నమోదు కావడం లేదు. వారం క్రితం వరకు రుతుపవనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోవడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 31శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వర్షపాతం సాధారణ స్థితికి చేరుకున్నది. కానీ జిల్లాలవారీగా చూసుకున్నప్పుడు 15 జిల్లాల్లో తీవ్ర లోటు ఉంది.
ఒక్క జిల్లాలో వర్షపాత లోటు అత్యంత తీవ్రంగా ఉంది. అదే సమయంలో ఐదు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 51 శాతం అధిక వర్షాలు పడ్డాయి. సూర్యాపేట, నాగర్ కర్నూల్, ఖమ్మంలలోనూ అధిక వర్షపాతం రికార్డ్ అయింది. మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 124.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 113 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వారం పాటు భారీ వర్షాలు..
మరోవైపు రాష్ట్రంలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో వర్షాలు పడ్తాయని తెలిపింది. హైదరాబాద్ సిటీలోనూ ఇవే వాతావరణ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు సోమవారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇటు కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 6.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 5.9 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 5.5, సంగారెడ్డి జిల్లా కడ్తాల్, మానూరులలో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
హనుమకొండ జిల్లాలో 72శాతం లోటు
హనుమకొండ జిల్లాలో అనావృష్టి నెలకొన్నది. ఆ జిల్లాలో 72 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వరంగల్( 57 శాతం), సిద్దిపేట(50), మేడ్చల్ మల్కాజ్గిరి(39), నిజామాబాద్ (35), ఆదిలాబాద్ (32), జోగులాంబ గద్వాల్ (30), కరీంనగర్ ( 29), యాదాద్రి భువనగిరి(29), మంచిర్యాల(28), జగిత్యాల(28), జనగామ(27), మెదక్, రాజన్న సిరిసిల్ల (26), వనపర్తి(23), కామారెడ్డి(22 ) జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయ్యింది. ఆయా జిల్లాల్లో వ్యవసాయ పనులు ఇంకా జోరందుకోలేదు. అడపాదడపా వేసిన పత్తి విత్తనాలు దుక్కుల్లోనే మాడిపోతున్నాయి. దీంతో వర్షం కోసం రైతులు దిక్కులు చూస్తున్నారు.
