హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌లో మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎం.ముజీబ్ అయూబ్.. సర్ ప్రక్రియలో ఉపయోగిస్తున్న అప్లికేషన్ ఫారాలు కేవలం తెలుగులోనే ఉండడం వల్ల ఇతర భాషలు మాట్లాడే ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు అడ్వకేట్ వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. సర్ ప్రక్రియలో ఉపయోగిస్తున్న అప్లికేషన్ ఫారాలు కేవలం తెలుగులోనే ఉండడం వల్ల ఇతర భాషలు మాట్లాడే ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో వలస కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు గణనీయంగా ఉన్నారని, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉర్దూ, ఆంగ్ల భాషలు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. వారికి అనుకూలంగా ఫారాలు అందుబాటులో లేవని వాదించారు.
తెలుగు రాని ఓటర్ల కోసం కనీసం ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లోనూ దరఖాస్తులు అందించాలని కోరారు. దీనిపై ఈసీ తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం అమలు చేస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. బీఎల్‌వోల వద్ద తెలుగు ఫారాలతో పాటు ఆంగ్లం, ఉర్దూలో నమూనా ఫారాలు కూడా అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే వాటిని పరిశీలించి దరఖాస్తులు నింపుకోవచ్చన్నారు.
వాదనలు విన్న ధర్మాసనం, పశ్చిమ బెంగాల్, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో సర్ అప్లికేషన్ ఫారాలను ఎన్ని భాషల్లో ముద్రిస్తున్నారో వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
