అక్రెడిటేషన్ల జారీలో అన్యాయాన్ని ఆపాలి: ఐ అండ్ పీఆర్ ఆఫీస్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ధర్నా...

అక్రెడిటేషన్ల జారీలో అన్యాయాన్ని ఆపాలి: ఐ అండ్ పీఆర్ ఆఫీస్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ధర్నా...
  • వెంటనే కార్డులు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: అక్రెడిటేషన్ల కార్డుల జారీలో డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం ఆపాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయం ఎదుట సంఘం నేతలు, సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజేఎస్ అధ్యక్షుడు బాదిని ఉపేందర్ మాట్లాడుతూ.. 10 నుంచి 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇప్పటికీ అక్రెడిటేషన్లకార్డులు ఇవ్వలేదని అన్నారు. పాత కార్డులపై ఉన్న బస్‌పాస్ గడువు మంగళవారంతో ముగుస్తోందని, వెంటనే కొత్త కార్డులు ఇవ్వకపోతే చాలా మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడతారని చెప్పారు. 

మహిళా జర్నలిస్టులు లేని సంస్థల్లో ఆ కోటా కార్డులను అదే సంస్థలో పనిచేస్తున్న అర్హులైన ఇతర జర్నలిస్టులకు ఇవ్వాలని కోరారు. అలాగే దివ్యాంగ జర్నలిస్టులకు మేనేజ్‌మెంట్ కోటాతో సంబంధం లేకుండా అక్రెడిటేషన్లకార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మండల విలేకరుల నుంచి సర్క్యులేషన్‌పై సీఏ సర్టిఫికెట్ అడగడం సరికాదన్నారు. ఇప్పటికే పత్రికలు ఏబీసీ, పీఆర్‌జీఐ గుర్తింపు సర్టిఫికెట్లు సమర్పిస్తున్నా.. మళ్లీ సీఏ సర్టిఫికెట్ కోరడం ఇబ్బందిగా మారిందన్నారు. 

ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో ఒకటి కంటే ఎక్కువ అక్రెడిటేషన్లకార్డులు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ధర్నా అనంతరం ఐ అండ్ పీఆర్ ఇన్‌చార్జి అదనపు డైరెక్టర్ జగన్‌కు డీజేఎస్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 

కార్యక్రమంలో డీజేఎస్​ ప్రధాన కార్యదర్శి కేఎన్​ రాజారామ్​, ట్రెజరర్ వి.వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ కనపర్తి రమేశ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పీ పద్మ, సంఘం ప్రతినిధులు సిలివేరు వెంకటేశం, చల్లా సైదిరెడ్డి, రమేశ్​, అశోక్​, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.