రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ ఎస్..కాంగ్రెస్ హయాంలో నెంబర్ వన్ గా నిలబెడుతాం : డిప్యుటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ ఎస్..కాంగ్రెస్ హయాంలో నెంబర్ వన్ గా నిలబెడుతాం : డిప్యుటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఎర్రుపాలెం, వెలుగు : పదేండ్లలో బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా జమలాపురం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్... రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచారని విమర్శించారు. 

రాష్ట్ర సంపదను కొద్ది మంది ప్రయోజనాలకే వినియోగించి, ప్రజల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఆ నలుగురు కుటుంబ సభ్యులు వందల కోట్లు కూటబెట్టి, ఆ అవినీతి సొమ్ముతో మీడియా చానళ్లు, పేపర్లు నడిపిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల  అవసరాలు తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. 

పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సేవారంగం, పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా తీర్తిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. 

వచ్చే నెల మొదటి వారంలో రైతు ఆశీర్వాద సభ : భట్టి, తుమ్మల

చింతకాని, వెలుగు : వర్షాల కారణంగా రైతులు, ప్రజలు ఇబ్బంది పడొద్దనే జగన్నాథపురంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభను వాయిదా వేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వర్షం అడ్డొచ్చినా రైతు సంక్షేమం ఆగదని, మంగళవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం నిధులను విడుదల చేస్తారని ప్రకటించారు. కేవలం తొమ్మి ది రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. రైతు భరోసా పంపిణీ పూర్తి అయిన తర్వాత, వాతావరణం అనుకూలిస్తే వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్  చేస్తున్నామన్నారు.