- ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ మ్యాన్డేటరీ
- త్వరలోనే గైడ్ లైన్స్ రిలీజ్ చేయనున్న ఇంటర్ బోర్డు
- ఈ ఏడాది నుంచే ఫస్టియర్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్
- సీసీ కెమెరాల ద్వారా కాలేజీలపై బోర్డు లైవ్ నిఘా
- రూల్ ప్రకారం ల్యాబ్‌లు లేకుంటే కాలేజీల గుర్తింపు కష్టమే
హైదరాబాద్, వెలుగు: ఇకపై ఇంటర్ విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని బొమ్మలు చూసి పాఠాలు నేర్చుకుంటే సరిపోదు.. వారానికి కనీసం రెండు రోజులు ల్యాబ్‌లోకి వెళ్లి ప్రయోగాలు చేయాల్సిందే. సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి జ్ఞానాన్ని అందించేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబ్ ప్రయోగాలు చేయించకుండా కేవలం థియరీ పాఠాలతోనే నెట్టుకొస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ను మ్యాన్డేటరీ చేస్తోంది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ఇంటర్ బోర్డు అధికారులు త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రంలోని 3,339 ఇంటర్ కాలేజీల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, అందులో దాదాపు 7 లక్షల మంది సైన్స్ గ్రూపుల్లోనే ఉన్నారు. సైన్స్ విద్యార్థులకు వారానికి ఏడు పీరియడ్లు ఉంటే, అందులో ఒక పీరియడ్‌ను ప్రాక్టికల్స్‌కు కేటాయిస్తున్నారు. కానీ, ఏ ప్రైవేటు కాలేజీ మేనేజ్మెంట్ కూడా దీనిని అమలు చేయకుండా, ఆ సమయాన్ని కూడా థియరీ క్లాసులకే వాడేసేవి. మరోపక్క కొన్ని కాలేజీలు కేవలం సెకండియర్ చివరి టైమ్ లో ప్రాక్టికల్స్ ప్రాక్టీజ్ చేయించేవి. చాలా కాలేజీలు డైరెక్ట్‌గా బోర్డు నిర్వహించే ప్రాక్టికల్స్ కే విద్యార్థులను పంపించేవి. ఈ ఏడాది నుంచి ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి.
కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది. థియరీ క్లాసులో నేర్చుకున్న అంశాలను అదే వారంలో ల్యాబ్‌లో ప్రయోగం చేసి చూసేలా కొత్త షెడ్యూల్ రూపొందిస్తున్నారు. సెక్షన్లు, విద్యార్థుల సంఖ్యను బట్టి వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ల్యాబ్ సెషన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు ఒక గొప్ప వరంగా మారనుంది. స్టూడెంట్లలో బట్టీ విధానం వల్ల కాన్సెప్టులపై అవగాహన రావడం లేదని, స్వయంగా ప్రయోగాలు చేయడం వల్ల సబ్జెక్టుపై లోతైన పట్టు పెరుగుతుందని సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇది కేవలం ఇంటర్ మార్కులకే కాకుండా.. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, జేఈఈ లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు దోహదపడనుందని భావిస్తున్నారు.
కాలేజీల్లో ల్యాబ్ ఉండాల్సిందే..
సర్కారు నిబంధనల ప్రకారం ప్రతి ఇంటర్ కాలేజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర ల్యాబ్‌లు ఉండాలి. కానీ, అనేక ప్రైవేట్ కాలేజీలు చిన్న గదుల్లో నడిపిస్తూ ల్యాబ్ సౌకర్యాలను విస్మరిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో ల్యాబ్‌రూమ్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జీని పెంచడమే లక్ష్యంగా ఇకపై ల్యాబ్ సదుపాయం లేని కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. గతంలో సెకండియర్ స్టూడెంట్లకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. ఈ ఏడాది నుంచి ఫస్టియర్ స్టూడెంట్లకూ ప్రారంభం కానుండటంతో.. ముందు నుంచే ల్యాబుల్లో ప్రాక్టికల్స్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కమాండ్ కంట్రోల్ నుంచి నిఘా..
కాలేజీలు బోర్డు రూల్స్ పాటిస్తున్నాయా.. లేదా? అనేది తెలుసుకునేందుకు అధికారులు టెక్నాలజీని వాడనున్నారు. రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీల సీసీ కెమెరాలను ఇప్పటికే ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ తో లింక్ చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా.. విద్యార్థులు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారా? అనే అంశాలను బోర్డు అధికారులు లైవ్‌లో మానిటర్ చేయనున్నారు. సీసీ కెమెరాల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ కనిపించకపోతే సంబంధిత కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు బోర్డు సిద్ధమవుతోంది. వారం, పది రోజుల్లోనే ప్రాక్టికల్స్, ల్యాబ్క్లాసులపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.
