ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్..ఫర్నిచర్, గృహోపకరాలు దగ్ధం

ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్..ఫర్నిచర్, గృహోపకరాలు దగ్ధం
  • తృటిలో తప్పిన ప్రాణనష్టం

పద్మారావునగర్, వెలుగు: ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. సికింద్రాబాద్​ రెజిమెంటల్‌‌‌‌బజార్‌‌‌‌లోని ఓ భవనం మొదటి అంతస్తులో సుధీర్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన భార్య, పనిమనిషి కలిసి వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఖాళీ అయింది. దీంతో మరో కొత్త సిలిండర్ అమర్చారు. అయితే అమర్చిన కొద్దిసేపటికే సిలిండర్ నుంచి వింత శబ్దాలు వినిపించడంతో పాటు చిమ్మర్లు రావడం గమనించారు.

వెంటనే వంటగదిలోకి వెళ్లి చూడగా అప్పటికే మంటలు చెలరేగాయి. సుధీర్ తండ్రితో పాటు కుటుంబ సభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి చేయి దాటుతోందని గుర్తించిన వారు మంటలు అంటుకున్న సిలిండర్‌‌‌‌ను పక్కకు నెట్టేసి వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వారు బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఇంట్లోని విలువైన వస్తువులు, గృహ సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. ఫైర్​ సిబ్బంది, హైడ్రా టీం మంటలను అదుపులోకి తెచ్చాయి. గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.