దుబ్బాకలో భారీ చోరీ..కిలోన్నర బంగారం, రూ.8 లక్షలు అపహరణ

దుబ్బాకలో భారీ చోరీ..కిలోన్నర బంగారం, రూ.8 లక్షలు అపహరణ

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కిలోన్నర బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, రూ.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణం 15వ వార్డుకు చెందిన చింత రాజకుమార్ మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల క్రితం కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి ఉంది.

దీన్ని గమనించిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఇంటి వెనుక వైపు కిటికీ ఊచలను విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లో ఉన్న లాకర్‌‌‌‌ను ధ్వంసం చేసి, అందులో భద్రపరిచిన 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, రూ.8 లక్షల నగదును అపహరించారు. ఉదయం ఇంటి పరిసరాలను శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి కిటికీ ఊచలు విరిగిపోవడం గమనించి చుట్టుపక్కల వారికి, ఇంటి యజమానికి సమాచారం ఇచ్చింది.

దుబ్బాక ఎస్సై కీర్తి రాజు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ బృందం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎస్పీ రష్మీ పెరుమాళ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఆమె వెంట సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుబ్బాక ఇన్‌‌‌‌చార్జి సీఐ వాసుదేవరావు తదితరులు ఉన్నారు.