- బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు అపార అవకాశాలు
- డిజిటన్ల లోన్లతో మరింత దూకుడు
- ఆనంద్ రాఠీ స్టడీ వెల్లడి
న్యూఢిల్లీ: పర్సనల్, వెహికల్ ఫైనాన్స్ వంటి రిటైల్లోన్లు ఇచ్చే బ్యాంకుల, ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని వెల్లడయింది. 2025 మొదటి ఆర్నెల్లలో ప్రైవేట్ క్రెడిట్ రూ.75 వేల కోట్ల రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ లోన్ల మార్కెట్లలో ఇండియా ఒకటిగా ఎదగనుందని వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆనంద్ రాఠీ తెలిపింది. దీని స్టడీ రిపోర్ట్ ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో రిటైల్ లోన్ల మార్కెట్ రూ.96 లక్షల కోట్లకు (ట్రిలియన్ డాలర్లు) చేరే అవకాశం ఉంది. డిజిటల్ లోన్లు వేగంగా పెరుగుతుండటం, కుటుంబ ఆదాయాల్లో వృద్ధి, ప్రభుత్వ విధానాలు ఈ మార్కెట్‌కు మేలు చేస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరం నుంచి రిటైల్ క్రెడిట్, కార్పొరేట్ క్రెడిట్ కంటే 2–3 రెట్లు వేగంగా వృద్ధి చెందింది. ఈ వృద్ధిలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) కీలకంగా మారాయి.
జనాభా పెరుగుదలతో మేలే
మనదేశంలో 2020 సంవత్సరంలో 10.8 కోట్ల మధ్యతరగతి కుటుంబాలు ఉండగా, 2030 నాటికి అవి 22 కోట్లకు చేరుకుంటాయని అంచనా. ఫలితంగా మరింత మంది హోం, ఆటో, పర్సనల్ లోన్లు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం స్వయం ఉపాధి పొందుతున్న వారిందరికీ లోన్లు అందడం లేదు. ఇక నుంచి ఈ వర్గం వారికీ లోన్లు సులువుగా దొరుకుతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో లోన్లు పొందడం సులభమైంది. ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ సంస్థలలో 100శాతం ఎఫ్డీలకు కూడా అవకాశం కల్పించింది. వడ్డీలు, ఇండ్ల ధరలు పెరగడం వంటి సవాళ్లు ఉన్నా, జనాభా పెరుగుదల, పట్టణీకరణ వల్ల హోం లోన్ల పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆనంద్‌రాఠీ తెలిపింది.
తనఖా రుణాలు తక్కువే
భారతదేశంలో తనఖా రుణాల (మార్ట్‌గేజ్ లోన్లు) వ్యాప్తి జీడీపీలో 11శాతం మాత్రమే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 60 శాతం నుంచి 120 శాతం వరకు ఉంది. దీనిని బట్టి చూస్తే హోం లోన్ల పెరుగుదలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇండ్ల కొనుగోళ్లు, పట్టణీకరణ, కుటుంబ ఆదాయాలు నిరంతరం పెరుగుతుండటమే ఇందుకు కారణం. యూపీఐ, ఇండియా స్టాక్, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్‌వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నానాటికీ పెరుగుతోంది. దీనివల్ల అప్పులు ఇవ్వడం సులువుగా మారింది. నిమిషాల్లో క్రెడిట్ అర్హతను అంచనా వేయడం సాధ్యపడుతోంది. తక్కువ ఖర్చుతో లోన్లను ఇవ్వడం వీలవుతోంది. డిజిటల్ రిటైల్ లోన్ల మార్కెట్ 2023లో రూ.22.6 లక్షల కోట్ల నుంచి 2030 నాటికి రూ.60.3 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఈ విభాగం లోన్లు ఏడాదికి 31శాతం చొప్పున వృద్ధి చెందుతున్నాయి.
