హైదరాబాద్ సిటీ, వెలుగు: పర్యావరణ పరిరక్షణ, నిరంతర విద్యుత్ సరఫరా ధ్యేయంగా టీజీఎస్పీడీసీఎల్ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కరెంట్‌లైన్ల సమీపంలో చెట్ల కొమ్మలను వేగంగా.. సురక్షితంగా తొలగించేందుకు ఆస్ట్రియాలో తయారైన అత్యాధునిక బ్యాటరీ ఆధారిత ట్రీ ప్రూనర్లను వినియోగంలోకి తెచ్చింది. సోమవారం బంజారాహిల్స్‌లోని అరోరా కాలనీలో బంజారాహిల్స్ ఆపరేషన్స్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ హనుమంతు రెడ్డి, ఏడీఈలు, ఎస్‌టీఐహెచ్‌ఎల్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఈ డివైజ్‌ల పనితీరుపై డెమో నిర్వహించారు.
ఈదురుగాలుల వేళ కరెంట్సమస్యలు
వర్షాకాలం ఈదురుగాలుల టైంలో 11 కేవీ విద్యుత్ లైన్లకు చెట్ల కొమ్మలు తగలడం వల్ల జరిగే ఫీడర్ ట్రిప్పింగ్‌లు, వైర్లు తెగిపోవడం వంటి సమస్యలకు ఈ బ్యాటరీ ట్రీ ప్రూనర్లు శాశ్వత పరిష్కారం చూపనున్నాయి. గతంలో సిబ్బంది చెట్లెక్కి కొమ్మలు నరికేవారు. దీనికి ఎక్కువ టైం పట్టేది. కరెంట్సరఫరా పునరుద్ధరించడానికి ఎక్కువ టైం పట్టేంది. కానీ, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ట్రీ ప్రూనర్ల ద్వారా నేలపై నుంచి లేదా బకెట్ ల్యాడర్ వాహనాల సాయంతో దూరం నుంచే కొమ్మలను చాలా వేగంగా తొలగించవచ్చు.
దీని వల్ల లైన్ల నిర్వహణ కోసం తీసుకునే షట్‌డౌన్ టైం కూడా తగ్గుతుంది. సిబ్బంది చెట్లు ఎక్కాల్సిన అవసరం లేకపోవడం వల్ల కరెంట్‌షాక్‌లు, పైనుంచి పడిపోవడం వంటి ప్రమాదాలు తగ్గుతాయి. పాత పెట్రోల్ మెషీన్లతో ఎయిర్, సౌండ్, పొగ కాలుష్యం ఉండేది. ఇప్పుడు తెచ్చిన బ్యాటరీ డివైజ్‌లు తక్కువ వైబ్రేషన్‌తో నడుస్తాయి. పెట్రోల్ఖర్చు ఉండదు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు రమేష్, మల్లేశం, గోపి, ఏఈలు అంజనేయులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
