అర్హులు ఓటు కోల్పోకుండా చూడాలి..పార్టీ శ్రేణులకు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ పిలుపు

అర్హులు ఓటు కోల్పోకుండా చూడాలి..పార్టీ శ్రేణులకు ప్రభుత్వ విప్  బల్మూరి వెంకట్ పిలుపు

హాలియా/హుజూర్ నగర్/కోదాడ, వెలుగు: అర్హులైన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్  శ్రేణులదేనని నల్గొండ పార్లమెంట్  కో ఆర్డినేటర్, ప్రభుత్వ ​ విప్​ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్  క్యాంప్  ఆఫీస్, హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో సర్​పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలను ఓటుకు దూరం చేసే దురుద్దేశంతో బీజేపీ సర్కార్​ సర్  ప్రక్రియను చేపట్టిందని విమర్శించారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజల ఓటు హక్కు కాపాడేలా 98 శాతం డిజిటలైజేషన్  పూర్తి కావడం హర్షణీయమన్నారు. అర్హులైన ఓటరు తప్పిపోకుండా కాంగ్రెస్​ శ్రేణులు చొరవ తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. అర్హులైన ఓటర్లు నమోదు కాకుండా మిగిలి ఉంటే వెంటనే గుర్తించి నమోదు పూర్తి చేయించాలని, ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్  చైర్మన్  ముత్తినేని వీరయ్య,పెరిక కార్పొరేషన్  చైర్మన్  దొంగరి వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, పున్న కైలాస్  నేత, రావుల శ్రీనివాస్, అంకిశెట్టి సత్యం రాజా, రమేశ్  యాదవ్, వెంపటి శ్రీనివాస్, గెల్లి రవి పాల్గొన్నారు.