బీసీబంధు స్కీమ్ ప్రవేశపెట్టాలి: ఆర్.కృష్ణయ్య

బీసీబంధు స్కీమ్ ప్రవేశపెట్టాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెంటనే బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో బీసీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్​లో  సీఎం ముఖ్య సలహాదారుడు సోమేశ్ కుమార్​ను ఆర్.కృష్ణయ్య కలిసి బీసీల సమస్యలను వివరించారు. 
కాలేజ్ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల స్కీమ్ పునరుద్ధరించాలని, రూ.5 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. బీసీ గురుకుల స్కూళ్లకు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నందున అదనంగా 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలన్నారు. గత తొమ్మిదిన్నర ఏండ్ల నుంచి రాష్ట్రంలో ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందలేదన్నారు. సోమేశ్ కుమార్ ను కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు లాల్ కృష్ణ, వేముల రామకృష్ణ, నీల వెంకటేశ్, భాస్కర్ ప్రజాపతి తదితరులు ఉన్నారు.