బిహార్ ఎలక్షన్స్ లో ఆన్ లైన్ ఓటింగ్ జరగనుందా?

బిహార్ ఎలక్షన్స్ లో ఆన్ లైన్ ఓటింగ్ జరగనుందా?

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇండియాలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. పోల్ క్యాంపెయినింగ్ తోపాటు ఓటింగ్ పద్ధతి కూడా సమూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తొలి అడుగు బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచే మొదలవ్వనుందని సమాచారం. అక్టోబర్–నవంబర్ లో జరగనున్న బిహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఆన్ లైన్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి ఆ రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ‘కరోనా కారణంగా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఎన్నికల ఓటింగ్ విధానంలోనూ సమూల మార్పులు రావొచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో (హెలికాప్టర్స్ ద్వారా) క్యాంపెయినింగ్ నిర్వహించడం, ఓటింగ్ (పోలింగ్ బూత్ ల్లో లైన్స్ లో నిలబడి ఓట్లేయడం) లాంటి వాటిని డిజిటల్ మోడ్ లో పోలింగ్ తో రీప్లేస్ చేయొచ్చు’ అని బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తెలిపారు.

డిజిటల్ పోలింగ్ పై బిహార్ కు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా స్పందించారు.‘రాజకీయ నేతల కంటే ఎక్కువగా టెక్నాలజీని వాడే ఓటర్లతో కనెక్ట్ అవ్వాలంటే అధునాతన సాంకేతికతను అవలంబించాల్సిందే. బిహార్ లో డిజిటల్ క్యాంపెయినింగ్ తోపాటు ఆన్ లైన్ ఓటింగ్ కూడా జరగొచ్చు’ అని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత నేషనల్ మీడియాకు చెప్పారు. కరోనా రావడానికి ముందు ఎలక్షన్ ఫొటో ఐడెంటిటీ కార్డుకు ఆధార్ ను లింక్ చేయాలని ఎలక్షన్ కమిషన్ భావించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీని ద్వారా ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆన్ లైన్ ఓటింగ్, డిజిటల్ పోల్ క్యాంపెయినింగ్ పై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.