ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులు ఖరారు చేసింది. 8 రాష్ట్రాల్లోని 25 లోక్ సభ స్థానాల్లో 22 సీట్లను గెలుచుకోవాలన్నదే తమ లక్ష్యమని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు మిత్రపక్షాలతో చర్చలు జరిపి పొత్తులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. అసోం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్), ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్ టీ ), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చాలతో పొత్తును ఖరారు చేసినట్లు చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాలు ‘నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్ఈడీఏ)’ గా ఏర్పడతాయని, మళ్లీ మోడీనే అధికారంలోకి రావాలనే నినాదంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)తో కలిసి పనిచేస్తాయని చెప్పారు. మంగళవారం నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్ , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన రాంమాధవ్ బుధవారం అగర్తలాలో త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్, ఐపీఎఫ్టీ నేతలతో సమావేశమయ్యారు.
బీజేపీ, ఏజీపీల మధ్య డీల్ ఓకే
అసోంలో బీజేపీ, అసోం గణ పరిషత్ (ఏజీపీ) మధ్య దోస్తీ కుదిరింది. పౌర సత్వం బిల్లుపై ఆగ్రహించి ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్న ఏజీపీ.. లోక్ సభ ఎన్ని కల్లో బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకుంది. చర్చల ద్వారా విభేదాలు తొలగిపోయాయని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించడమే టార్గెట్ గా పనిచేస్తాయని రాంమాధవ్ చెప్పారు. రాష్ట్రంలోని 14 సీట్లను గెలుచుకుంటా మని ధీమా వ్యక్తంచేశారు. ‘‘ఈశాన్యంలో బీజేపీ, అన్ని ప్రధాన పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ఎన్డీఏ కూటమికి మద్దతునిచ్చేందుకు నేతలు ఒప్పుకున్నారు. బీజేపీ, ఎన్ పీపీ, ఎన్డీపీపీ, ఏజీపీ, బీపీఎఫ్ పార్టీలు కలిసి అస్సాంలో పోటీ చేస్తా యి. నాగాలాండ్ , మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కలిసి పనిచేస్తాం . త్రిపురలో బీజేపీ, ఐపీఎఫ్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తా యి. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చాతో కలిసి ముందుకెళ్తాం ” అని రాంమాధవ్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

