V6 News

బిర్యానీ, పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్...! ముంబైలో ఫ్యామిలీ అనుమానాస్పద మృతి..

బిర్యానీ, పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్...! ముంబైలో ఫ్యామిలీ అనుమానాస్పద మృతి..

ఎండాకాలం... ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు, తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఎండాకాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటం కోసం ఎక్కువ నీళ్లు తాగడం, జ్యూసులు తాగడంతో పాటు పుచ్చకాయ కూడా తింటుంటాం. ఎండాకాలంలో పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటమే కాకుండా చాలా లాభాలున్నాయి. అయితే ముంబైలో ఓ ఫ్యామిలీ పుచ్చకాయ తినడం వల్ల మృతి చెందారు. ఏంటి...? పుచ్చకాయ తింటే ఫుడ్ పాయిజన్ అవ్వడమేంటి అనుకుంటున్నారా...? ఈ ఘటన చూస్తుంటే నమ్మాల్సి వస్తోంది.

ముంబైలోని పైధోని ఏరియాలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందారు. పైధోని ప్రాంతానికి చెందిన అబ్దుల్లా డీకొడియా, తన భార్య, ఇద్దరు కూతుళ్లు ఏప్రిల్ 25న బంధువులతో కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత అందరు వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు .అదే రోజు తెల్లవారుజామున 1:00 గంట నుండి 1:30 గంటల మధ్య అబ్దుల్లా అతని కుటుంబసభ్యులు నలుగురు పుచ్చకాయ తిని పడుకున్నారు.

మరుసటి రోజు ఉదయం ( ఏప్రిల్ 26 ) నలుగురికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అబ్దుల్లా చిన్న కూతురు మృతి చెందగా... అదేరోజు అబ్దుల్లా కూడా మృతి చెందాడు. ఆ తర్వాత అబ్దుల్లా భార్య, పెద్ద కూతురు కూడా మృతి చెందారు.

ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని... హిస్టోప్యాథలాజికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నలుగురి మృతికి గల కారణం నిర్దారించవచ్చని అంటున్నారు పోలీసులు. ఫుడ్ పాయిజన్ కు కారణం ఏంటో తెలియాల్సి ఉందని అంటున్నారు పోలీసులు. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే ఫుడ్ పాయిజన్ కు దారి తీసిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.