హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. ఆయిల్ కంపెనీలు కొన్ని కారణాల వల్ల సరఫరా ఆలస్యం చేయటం వల్లే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వివరించారు తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. ఆయిల్ కంపెనీలు ఆయిల్ ఇవ్వటంలో లేట్ చేస్తున్నాయని.. కారణం ఏంటి అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం అంటున్నారాయన. 2026, ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రానికి కారణాలపై క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన.
ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా తగ్గటం వల్లే.. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని... కొన్ని బంకుల యజమానులు తీసుకున్న క్రెడిట్ కు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవటం వల్ల కూడా నో స్టాక్ బోర్డులు పెడుతున్నట్లు వివరించారు తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి.
ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఆయిల్ కంపెనీలు తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయని.. రోజువారీగా వేల కోట్ల రూపాయలపై ఆయిల్ కంపెనీలపై పడుతున్నట్లు స్పష్టం చేశారాయన. పశ్చిమ బెంగాల్ లో 29వ తేదీన చివరి విడత పోలింగ్ ఉందని.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు కొంత వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారాయన.
మన దేశంలో ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. దేశ అవసరాలకు కావాల్సినంత నిల్వలు ఉన్నాయని.. కొరత రాదని స్పష్టం చేసిన ఆయన.. ఆయిల్ కంపెనీలు సరఫరాను పెంచితే అంతా సెట్ రైట్ అవుతుందన్నారాయన. సోషల్ మీడియాలో వచ్చే వార్తల వల్ల.. చాలా మంది పెట్రోల్, డీజిల్ అవసరానికి మించి తీసుకెళుతున్నారని.. కొంత మంది క్యాన్లు, డ్రమ్ముల్లో నింపుకుంటున్నారని.. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని జనానికి పిలుపునిచ్చారాయన. ఇలాంటి పనులు వల్ల నిజంగా ఆయిల్ కొరత వస్తుందన్నారు.
సరఫరా విషయంలో ఆయిల్ కంపెనీలు క్లారిటీ ఇవ్వాలని.. 24 గంటల్లో అంతా సెట్ రైట్ అవుతుందని.. పుకార్లను వాహనదారులు నమ్మొద్దని పిలుపునిచ్చారు తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి.

