తెలంగాణ ప్రజలు ఎటువైపున్నరో తేలిపోయింది

తెలంగాణ ప్రజలు ఎటువైపున్నరో తేలిపోయింది

నిజామాబాద్: గజినీ మహ్మద్ కంటే ఎక్కువగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘అసలు ఎవరు వీరు ? ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోవట్లేదు ? ’’ అని ఆయన ప్రశ్నించారు. నిన్న జరిగిన అమిత్ షా సభతో తెలంగాణ ప్రజలు ఎవరి వైపున్నారో తేటతెల్లం అయిపోయిందన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి వేముల ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తెలంగాణలో జాతీయ సమైక్యతా దినోత్సవాల్ని  జరుపుతుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు దండయాత్రలు చేస్తున్నారని వేముల మండిపడ్డారు. అసలు వారికి తెలంగాణ చరిత్ర గురించి ఏం తెలుసని కామెంట్ చేశారు.  కేసీఆర్ ను తప్ప ఇతరులను తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.

‘‘కేంద్ర మంత్రులు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెడుతున్నరు. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని మోదీ తెలుసుకోవాలి. గిరిజన బంధుపై రాష్ట్రపతి స్పందించాలి.గిరిజన బిడ్డగా ఆమె రిజర్వేషన్ కు అనుకూలంగా కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేవాలి’’ అని మంత్రి వేముల చెప్పారు. ‘‘పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు. ఇక్కడి ప్రజలు గాజులు తోడుక్కోలే. జీవిత కాలం ఎవరూ ఢిల్లీ గద్దె పై ఉండరు’’ అని అన్నారు.