కశ్మీరీ పండిట్లకు బీజేపీ చేసిందేమీ లేదు

కశ్మీరీ పండిట్లకు బీజేపీ చేసిందేమీ లేదు

కశ్మీరీ పండిట్లను బీజేపీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప.. ఆ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా ఆరోపించారు. కశ్మీరీ పండిట్లకు చాలా హామీలిచ్చిన బీజేపీ వాటిని నెరవేర్చలేదని అన్నారు. ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ మైనారిటీ సెల్‌.. కశ్మీరీ పండిట్లకు సంబంధించి మూడు తీర్మానాలను చేసింది. కశ్మీరీ హిందువుల ఆలయాల సంరక్షణకు చట్టం తేవడం, కశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం సమగ్రమైన ప్యాకేజీ ఇవ్వడం, వారికి పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించడం అనే మూడు డిమాండ్లను ఆ తీర్మానంలో పెట్టారు. ఈ తీర్మానాలను తమ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఫరూఖ్ తెలిపారు. 

కశ్మీరీ పండిట్లకు ఫరూఖ్ క్షమాపణలు

ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఫరూఖ్ అబ్దుల్లా.. కశ్మీరీ పండిట్లకు క్షమాపణలు చెప్పారు. 1990ల్లో జరిగిన దారుణకాండల నుంచి కశ్మీరీ పండిట్లను కాపాడలేకపోయినందుకు మన్నించాలని ఆయన కోరారు. తమ పాలనలో కశ్మీరీ పండిట్లను తిరిగి కశ్మీర్ రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, కానీ కొంత మంది ఆ ప్రయత్నాలను నాశనం చేసి కశ్మీరీ పండిట్ల ఊచకోతకు పాల్పడ్డారని ఫరూఖ్ చెప్పారు. కశ్మీరీ పండిట్లు స్వరాష్ట్రం నుంచి వలస వెళ్లిపోయాక అష్టకష్టాలు అనుభవించారని, వాళ్ల బాధలు వర్ణనాతీతమని అన్నారు. కశ్మీరీ పండిట్లు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నించాయని, పండిట్లను కశ్మీర్ వదిలి వెళ్లిపోయేలా చేసింది ముస్లింలు కాదని, కొందరు స్వీయ కేంద్రీకృత వ్యక్తులేనని అన్నారు. పండిట్లు అంతా వెళ్లిపోతే కశ్మీర్‌‌ను తమ సొంతం చేసుకోవచ్చని ఆ వ్యక్తులు అనుకున్నారని, అయితే వాళ్లు అనుకున్నది ఎప్పటికీ జరగదని ఫరూఖ్ చెప్పారు. కశ్మీరీ పండిట్లకు ఆశ్రయమిచ్చిన జమ్ము ప్రజలను అభినందిస్తున్నానని అన్నారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాన్ని నింపి లాభం పొందాలని శత్రువులు చూస్తున్నారని, మనం దానిని తిప్పికొట్టాలని ఫరూఖ్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నాయకలు.. రాజకీయాలను, మతాన్ని వేర్వేరుగా చూడకపోతే దేశం అస్తిత్వాన్ని కోల్పోతుందని అన్నారు.