మార్ఫింగ్‌‌ చేస్తే.. స్మాష్ తో పట్టేస్తరు!

మార్ఫింగ్‌‌ చేస్తే.. స్మాష్ తో పట్టేస్తరు!
  • సోషల్‌‌ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా
  • సైబర్ క్రైమ్ టీమ్ ల పర్యవేక్షణలో స్పెషల్ ఆపరేషన్
  • పొలిటికల్ కంటెంట్స్‌‌, మార్ఫింగ్‌‌ పోస్టింగ్స్‌‌  స్క్రూట్నీ
  • ఫేక్‌‌ న్యూస్ వైరల్ చేసే వారిని గుర్తించి యాక్షన్‌‌
  • క్రియేటర్స్ కు  ఐటీ యాక్ట్‌‌ కింద నోటీసులు జారీ

హైదరాబాద్‌‌, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా స్పీచ్ మార్ఫింగ్‌‌ వీడియో కలకలం రేపిన కారణంగా రాష్ట్ర పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. దీంతో సోషల్‌‌ మీడియా పోస్టులు, వీడియోలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వీవీఐపీల బహిరంగ సభలకు సంబంధించి ఎలాంటి ఫేక్ న్యూస్‌‌ వైరల్ చేసినా వెంటనే  సోషల్‌‌ మీడియా యాక్షన్ స్క్వాడ్‌‌(స్మాష్‌‌) ద్వారా గుర్తిస్తారు.

ఇందుకు సోషల్ మీడియా మానిటరింగ్‌‌ యూనిట్‌‌ను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. మార్ఫింగ్ వీడియోస్‌‌, ఫొటోలు క్రియేట్ సర్క్యులేట్‌‌ చేస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టే కంటెంట్స్‌‌, వీడియోలు, ఫొటోలు  పోస్టింగ్‌‌ చేసినా పోలీసులు క్రియేటర్స్ పై యాక్షన్ తీసుకుంటారు. 

సోషల్‌‌ మీడియా గ్రూప్స్‌‌లో వచ్చే పోస్టింగ్స్‌‌ను

బంజారాహిల్స్‌‌ లోని కమాండ్ అండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌లో స్పెషల్ టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ సోషల్ మీడియా సర్వైలెన్స్‌‌ వింగ్‌‌, స్మాష్ తో మానిటరింగ్‌‌ చేస్తున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పోలీసులు రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రచారాలు, సభలు, సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తగు చర్యలు చేపట్టారు. ఇందుకు పొలిటికల్‌‌ పార్టీలు, మీడియా, సోషల్‌‌ మీడియా గ్రూప్స్‌‌లో వచ్చే పోస్టింగ్స్‌‌ను కూడా సేకరిస్తున్నారు.

రెచ్చగొట్టే విధంగా సర్క్యులేట్‌‌ అవుతున్న వీడియో క్లిప్పింగ్స్‌‌ ను మార్ఫింగ్ చేశారా..? లేదా ఒరిజినల్ వీడియోనా అనేది గుర్తిస్తున్నారు. ప్రచారాలు, పోలింగ్‌‌రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓల్డ్‌‌ సిటీతో  సహా సిటీలోని సోషల్‌‌మీడియా గ్రూప్స్‌‌ పై ప్రత్యేకంగా నిఘాను పెంచారు. 

ఫేక్‌‌ కంటెంట్స్‌‌ పోస్ట్ చేసే వారిని ట్రేస్..  

అధికార, ప్రతిపక్ష పార్టీల ట్విట్టర్, వాట్సాప్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్స్‌‌పై స్పెషల్ నిఘా పెట్టారు. ఆయా పార్టీల సోషల్‌‌ మీడియా యూనిట్‌‌పై మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఆయా పార్టీల గ్రూప్స్‌‌లో ఎలాంటి పోస్టింగ్స్ వచ్చినా సమాచారం తీసుకుంటున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారి ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా ఫేక్ వీడియోస్‌‌ ఎవరు క్రియేట్‌‌ చేశారనేది గుర్తించనున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌‌ మీడియా ఫ్లాట్ ఫామ్‌‌లో వచ్చే ప్రతి పోస్టును స్క్రూట్నీ చేస్తున్నారు.

పోలింగ్‌‌ డే సమీపిస్తుండగా ఫేక్‌‌ కంటెంట్స్‌‌ను  పోస్ట్ చేసే వారిని ట్రేస్ చేస్తున్నారు. లోక్‌‌సభ ఎన్నికల కోడ్‌‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి గ్రేటర్ పరిధిలో 8 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఐటీ యాక్ట్‌‌ కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించారు.