Asia Cup 2025: వర్క్‌లోడ్ బ్యాలన్స్: ఆసియా కప్‌కు బుమ్రా.. ఆ టెస్ట్ సిరీస్‌కు దూరం

Asia Cup 2025: వర్క్‌లోడ్ బ్యాలన్స్: ఆసియా కప్‌కు బుమ్రా.. ఆ టెస్ట్ సిరీస్‌కు దూరం

ఆసియా కప్ 2025 ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ కు అందుబాటులో ఉండడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన చివరిదైన ఐదో టెస్టుకు రెస్ట్ తీసుకున్న బుమ్రా ఆసియా కప్ కు నెలకు పైగా విరామం లభించడంతో ఈ కాంటినెంటల్ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. బుమ్రా పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ అతనికి ఆసియా కప్ లో ఆడకుండా రెస్ట్ ఇవ్వాలని అనుకున్నా ప్రధాన టోర్నీ కావడంతో బరిలోకి దిగనున్నాడు. 

సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆసియా కప్ జరగనుంది. సెప్టెంబర్ 19 లేదా 20 న ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్ తో పాటు బుమ్రా కొత్త బంతిని పంచుకోనున్నాడు. ఆసియా కప్ టోర్నీ తర్వాత  అక్టోబర్ 2–6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో టీమిండియా తొలి టెస్ట్ ఆడనుంది. ఆసియా కప్ కు, విండీస్ సిరీస్ కు మూడు రోజులు మాత్రమే గ్యాప్ ఉండడంతో బుమ్రా తొలి టెస్టుకు దూరం కానున్నాడు. రెండో టెస్ట్ లో ఆడతాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. అక్టోబర్ 10-14వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది. 

విండీస్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ తర్వాత భారత జట్టు వన్డే, టీ20 ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఆసీస్ తో జరగబోయే ఈ ఛాలెంజింగ్ సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉండొచ్చు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో 31 ఏళ్ల బుమ్రా  ఆడిన మూడు టెస్ట్‌లలో 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. హెడింగ్లీ, లార్డ్స్‌లో ఐదు వికెట్ల హాల్ ఉన్నాయి. ఇంగ్లండ్ టూర్ లో పని భారాన్ని పరిగణనలోకి తీసుకునే బుమ్రాను మూడు టెస్టులోనే ఆడించామ ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్ అన్నాడు. ఐదో టెస్టులో బుమ్రా ఆడతాడని చివరి నిమిషం వరకు భావించినా.. కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ విశ్రాంతికే మొగ్గారు.