నా పెళ్లిపై 'లవ్ జిహాద్' ముద్ర వేయకండి.. విమర్శకులకు మోనాలిసా భోంస్లే ఘాటు కౌంటర్!

నా పెళ్లిపై 'లవ్ జిహాద్' ముద్ర వేయకండి.. విమర్శకులకు మోనాలిసా భోంస్లే ఘాటు కౌంటర్!

కుంభమేళాలో పూసలమ్మే సాదాసీదా అమ్మాయిగా కనిపించి, తన అందంతో దేశాన్ని తనవైపు తిప్పుకున్న మోనాలిసా భోంస్లే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో 'వైరల్ గర్ల్'గా గుర్తింపు పొందిన ఈమె, తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. మతాంతర వివాహం, తండ్రి వ్యతిరేకత, రాజకీయ నాయకుల జోక్యం.. వెరసి ఒక సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా ఆమె వివాహం కేరళలో జరిగింది. ప్రస్తుతం ఆమె పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడు ముళ్ల బంధం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు, మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్‌తో ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. అయితే వీరి మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెకు వేరే సంబంధాలు చూడటం, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మోనాలిసా అడ్డు చెప్పింది. తన ప్రేమ కోసం పోలీస్ స్టేషన్ తలుపులు తట్టింది.

కేరళలో హై డ్రామా!

మార్చి 11, 2026 (బుధవారం) నాడు కేరళలోని తిరువనంతపురం సమీపంలోని అరుమనూర్‌ శ్రీ నైనార్ దేవా ఆలయం వీరి వివాహానికి వేదికైంది. ఆ రోజు ఉదయమే మోనాలిసా తన తండ్రి నుండి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఆలయానికి చేరుకుని, హిందూ సంప్రదాయాల ప్రకారం ఫర్మాన్ ఖాన్ చేత మూడు ముళ్లు వేయించుకుంది. పండితుల ఆశీర్వాదం తీసుకుంది.

'లవ్ జిహాద్' ఆరోపణలు.

ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు దీనిని ‘లవ్ జిహాద్’ అని విమర్శిస్తుండగా, మోనాలిసా ఘాటుగా స్పందించారు. నేను మేజర్‌ని, నా జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు నాకుంది. నేను మనస్ఫూర్తిగా హిందూ ఆచారాల ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. అన్ని మతాల పట్ల నాకు గౌరవం ఉంది. దయచేసి మా ప్రేమకు మతం రంగు పులమకండి అని ఆమె స్పష్టం చేశారు.

రాజకీయ అండ..

విచిత్రమేమిటంటే, ఈ వివాహానికి కేరళ అధికార పార్టీ నేతలు మద్దతుగా నిలిచారు. మంత్రి వి. శివన్‌కుట్టి, ఎంపీ ఏ.ఏ. రహీమ్ వంటి ప్రముఖులు స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం మోనాలిసా కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదు, సినీ నటిగానూ రాణిస్తున్నారు. మలయాళంలో ‘నాగమ్మ’, బాలీవుడ్‌లో వివాదాస్పద దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ వంటి చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఒక సామాన్య అమ్మాయి నుండి నేషనల్ సెన్సేషన్ వరకు సాగిన మోనాలిసా ప్రయాణం.. ఇప్పుడు ఈ వివాదస్పద వివాహంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.