ఇండేన్ గ్యాస్ బుకింగ్‌‌ సిస్టమ్ క్రాష్

ఇండేన్ గ్యాస్ బుకింగ్‌‌ సిస్టమ్ క్రాష్
  • 8-10 రెట్లు పెరిగిన కాల్స్‌‌తో మొరాయించిన ఐవీఆర్ఎస్ 

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌పీజీ సిలిండర్ బుకింగ్‌‌లు పెరగడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ ఒక్కసారిగా క్రాష్ అయింది. రోజు వారీ ఫోన్ కాల్స్​తో పోలిస్తే 8 నుంచి 10 రెట్లు పెరగడంతో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐఓసీఎల్), మిస్డ్ కాల్ సేవలు ఓవర్‌‌లోడ్ అయ్యి సర్వర్లు మొరాయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 15 కోట్లకు పైగా గృహాలకు ఐఓసీఎల్ గ్యాస్ సరఫరా చేస్తోంది.  ఎక్కువ మంది మిస్డ్ కాల్ ద్వారా బుకింగ్ చేయడానికి ప్రయత్నించడంతో సిస్టమ్‌‌పై భారీ ఒత్తిడి పడింది. పానిక్ బుకింగ్‌‌లు, పదేపదే ప్రయత్నాలు చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా వెండర్ ఇన్‌‌వాయిస్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ కూడా డౌన్​అయినట్లు సమాచారం.

దీంతో డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల వద్ద వినియోగదారులు గుంపులు కట్టడంతో గందరగోళం నెలకొంది.  ఐఓసీఎల్ వినియోగదారులకు బుకింగ్​కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలను సంస్థ సూచించింది. ఇండియన్​ఆయిల్​మొబైల్ యాప్, వాట్సాప్​, ఇండియన్​ఆయిల్​.ఇన్​కస్టమర్​పోర్టల్​, మై ఎస్పీజీ.ఇన్​, బీబీపీఎస్​ప్లాట్​ఫామ్​లు ఫోన్​పే, పేటీఎం, అమెజాన్​పే ద్వారా బుకింగ్​చేసుకోవాలని సూచించింది.  రాత్రి 10 గంటల తర్వాత (ఆఫ్-పీక్ సమయాల్లో) బుకింగ్ ప్రయత్నించాలని సూచించింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య చేసిన అభ్యర్థనలు మరుసటి రోజు ఉదయం 6 తర్వాత ప్రాసెస్ అవుతాయని అధికారులు తెలిపారు.