- మొదటి విడత కింద రూ.4,500 కోట్లు ఇస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఆ తర్వాత మిగిలిన మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేస్తం
- చెన్నూరులో 60 వేల ఎకరాలకు నీరందించేలా త్వరలో కొత్త ప్రాజెక్టు
- ఇప్పటికే ప్రాజెక్టు గురించి ఉత్తమ్‌కు వివరించినట్టు వెల్లడి
- మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో మంత్రి పర్యటన
కోల్‌బెల్ట్, వెలుగు: రైతుల ఖాతాల్లో త్వరలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మొత్తం రూ.9 వేల కోట్లకు గాను మొదటి విడతలో రూ.4,500 కోట్లు చెల్లిస్తామని, మిగతావి ఈ తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో మంత్రి పర్యటించారు. చెన్నూరు పాత మార్కెట్ కమిటీ ఆఫీస్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్ పాపిరెడ్డి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. జైపూర్ మండలం జైపూర్, ఇందారం, మిట్టపల్లిల్లో మహిళా సంఘాల సభ్యుల కోసం రూ.60 లక్షలతో నిర్మించనున్న ఆరు గ్రామ సమాఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకే దఫాలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిందని, ఇందుకు రూ.23 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. దేశంలోనే రికార్డు స్థాయిలో రైతుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశామని, పేదలకు సన్నబియ్యం పంపిణీ, సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ ఇచ్చామన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక చేపట్టిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. అలాగే, ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని, సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.
త్వరలో చెన్నూరులో కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు..
కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ప్రాణహిత, -చేవేళ్ల ప్రాజెక్టు కోసం కృషి చేశారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.11 వేల కోట్లను ఖర్చు చేసిందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాణహితను పక్కనబెట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిందని, ఈ ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ రూ.లక్ష కోట్ల కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంతో చెన్నూరుకు ఒక చుక్క నీరు రాలేదని, బ్యాక్ వాటర్‌తో పంటలు మునిగి రైతులు నష్టపోయారన్నారు. బబ్బెరచెలక, దేవులవాడ, లక్ష్మిపూర్ రైతుల నుంచి వందల ఎకరాల భూములు సేకరించారని, కానీ ఏండ్లు గడిచినా ఆ భూములకు సంబంధించి రైతులకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే అయ్యాక పరిహారం ఇప్పించేందుకు కృషి చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.21 కోట్లు మంజూరు చేయించానని ఆయన తెలిపారు. శివ్వారం గ్రామ రైతులకు రావాల్సిన రూ.2.80 కోట్ల పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చెన్నూరు నియోకజవర్గంలో 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని అందించేందుకు కొత్తగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకువస్తున్నట్లు చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పటికే అనుమతులు కోరానని, త్వరలో సాంక్షన్ వస్తుందన్నారు. కేంద్రం బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం నిర్వహించే వేలం పాటలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని గుర్తుచేశారు. కొత్త బొగ్గు గనుల అవశ్యకతను రేవంత్ రెడ్డికి వివరించి.. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనేందుకు సీఎంను ఒప్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, చెన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్, ఆఫీసర్లు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ప్రభుత్వం పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులను మంజూరు చేస్తుందని చెప్పారు. వైఎస్సార్ హయాంలో మహిళలకు పావలా వడ్డీ రుణాలివ్వగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. తిరిగి తమ ప్రభుత్వం మహిళలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో రూ.3.5 కోట్ల నిధులతో మహిళా సంఘాల కోసం 35 గ్రామ సమాఖ్య సంఘ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు.
