'అల్లు సినిమాస్‌'ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్పెషల్ స్క్రీన్ పై 'పుష్ప 2' ప్రదర్శన!

'అల్లు సినిమాస్‌'ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్పెషల్ స్క్రీన్ పై 'పుష్ప 2' ప్రదర్శన!

అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సాయంత్రం (మార్చి 12, 2026) వైభవంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఐటీ హబ్ కోకాపేటలో అత్యాధునిక హంగులతో దీనిని రూపొందించారు. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం అటు రాజకీయ, ఇటు సినీ ప్రముఖుల కలయికతో ఒక వేడుకలా సాగింది. ఈ సందర్భంగా అల్లుకుంటుంబానికి అభినందనలు తెలిపారు.

 గ్రాండ్ లాంచ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత దివంగత లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లు కుటుంబ సభ్యులతో కలిసి మల్టీప్లెక్స్ విశేషాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలి స్క్రీన్‌పై 'పుష్ప-2' ప్రత్యేక దృశ్యాలను ప్రదర్శించగా, సీఎం , ఇతర ప్రముఖులు  తిలకించారు.  అల్లు కుటుంబాన్ని అభినందించారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, క్రిష్‌, తెలంగాణ చలనచిత్ర, టీవీ, థియేటర్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్, నిర్మాత దిల్ రాజు,  తో పాటు ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు

ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్!

సాధారణ థియేటర్లకు భిన్నంగా, ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉండగా, స్క్రీన్‌ 1 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ (Dolby Vision) కలిగిన స్క్రీన్‌గా రికార్డు సృష్టించింది. అత్యుత్తమ నాణ్యతతో సినిమా చూసే అనుభవాన్ని ఇది మరో స్థాయికి తీసుకెళ్లనుందని  అల్లు అరవింద్ తెలిపారు..

ఉగాది నుంచి సినిమా జాతర!

అల్లు సినిమాస్‌లో సాధారణ ప్రేక్షకులకు ప్రదర్శనలు మార్చి 19 (ఉగాది) నుండి ప్రారంభం కానున్నాయి.  తొలి వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’,  పాటు బాలీవుడ్  ‘ధురంధర్‌ 2’ సినిమా ఇక్కడ సందడి చేయనున్నాయి.శుక్రవారం (మార్చి 13) నుండి 'బుక్‌ మై షో'లో టికెట్లు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న సినీ క్రేజ్‌కు ఈ మల్టీప్లెక్స్ ఒక మైలురాయిగా నిలవనుంది. 'అల్లు' బ్రాండ్‌కు ఉన్న క్రేజ్, డాల్బీ విజన్ టెక్నాలజీ తోడవ్వడంతో సినీ అభిమానులు ఇక్కడ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.