యశోద హాస్పిటల్లో దొంగ డాక్టర్..రోగికి మత్తు ఇచ్చి.. 10 తులాల బంగారంతో పరార్

యశోద హాస్పిటల్లో దొంగ డాక్టర్..రోగికి మత్తు ఇచ్చి.. 10 తులాల బంగారంతో పరార్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యశోద ఆస్పత్రిలో విస్తుపోయే ఘటన జరిగింది. నకిలీ వైద్యురాలి ముసుగులో ఓ మహిళ రోగికి మత్తు ఇచ్చి బంగారంతో ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ప్రాంతానికి చెందిన సుధారాణి అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరారు.

చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఓ మహిళ వైద్యురాలి వేషంలో సుధారాణి ఉన్న గదిలోకి వెళ్లింది. రోగికి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వాల్సి ఉందని చెప్పి కుటుంబసభ్యులను బయటకు వెళ్లమని సూచించింది. దీంతో వారు గది బయటకు వెళ్లగా, కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అనంతరం కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ కోల్పోయి ఉండటంతో అనుమానించారు. ఆమె ధరించిన సుమారు పది తులాల బంగారం కనిపించకపోవడంతో వెంటనే ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ మహిళ తమ ఆస్పత్రికి చెందిన సిబ్బంది కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే చోరీ చేసిన మహిళను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.