మ్యాన్ హోల్ అంటే చెత్తబుట్ట కాదు.. హైదరాబాదీలకు జలమండలి స్ట్రాంగ్ వార్నింగ్..

మ్యాన్ హోల్ అంటే చెత్తబుట్ట కాదు.. హైదరాబాదీలకు జలమండలి స్ట్రాంగ్ వార్నింగ్..

మ్యాన్ హోల్స్ విషయంలో హైదరాబాదీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది జలమండలి. మ్యాన్ హోల్ అంటే చెత్తబుట్ట కాదని... ఇష్టం వచ్చినట్లు చెత్త వేయొద్దని హెచ్చరించింది జలమండలి. మాధాపూర్ సర్కిల్ చందర్ నాయక్ తండా ప్రాంతంలో సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్య ఏర్పడ్డ క్రమంలో ఈమేరకు హెచ్చరించింది జలమండలి. ప్రధాన సీవరేజ్ పైపులో తీవ్ర చోకేజి కారణంగా రోడ్లపైకి మురుగు ప్రవహిస్తున్న క్రమంలో సోషల్ మీడియా ద్వారా అనేక ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది జలమండలి.

గత మూడు రోజులుగా హైప్రెషర్ జెట్టింగ్ మెషిన్ తో డీ-సిల్టింగ్ పనులు చేపట్టామని..టెలిస్కోపిక్ హైడ్రాలిక్ గ్రాబర్ తో పైపుల్లో సిల్ట్ తొలగించినట్లు తెలిపింది. మ్యాన్ హోళ్లలో నుంచి బ్లాంకెట్లు, బెడ్ షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర ఘన వ్యర్థాలు వెలికితీశామని తెలిపారు సిబ్బంది. కొన్నిచోట్ల మ్యాన్ హోళ్లలో నుంచి దిండ్లు, పరుపులు కూడా బయటకు తీశామని...ఘన వ్యర్థాల వల్ల మురుగు ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలిపారు.

వ్యర్థాలు పేరుకుపోవడంతో మ్యాన్ హోళ్లు పొంగిపోతున్న పరిస్థితి ఏర్పడిందని..ప్రజల అవగాహన లోపమే సమస్యకు ప్రధాన కారణమని తెలిపారు అధికారులు.హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు సీవరేజ్ నెట్‌వర్క్ కు నేరుగా కనెక్షన్ సిల్ట్ ఛాంబర్లు లేకపోవడం వల్ల పైపుల్లోకి ఘన వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయని.. దీంతో సీవరేజ్ పైపులపై ఒత్తిడి పెరిగి ఓవర్ ఫ్లో అవుతోందని తెలిపారు సిబ్బంది.

అర్హులైన వినియోగదారులు తప్పనిసరిగా సిల్ట్ ఛాంబర్లు ఏర్పాటు చేయాలని.. ఇకపై మ్యాన్ హోళ్లలో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జలమండలి అధికారులు. నగర శుభ్రత కోసం ప్రజలు బాధ్యతగా సహకరించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. మాన్ హోళ్లలో చెత్త, ఘన వ్యర్థాలు వేయకుండా జాగ్రత్త పడాలని సూచించింది జలమండలి.