మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్.. 'దూకుడు' రీ–రిలీజ్‌తో ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్!

మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్.. 'దూకుడు' రీ–రిలీజ్‌తో ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్!

ఆగస్టు నెల వచ్చిందంటే చాలు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగే. ప్రతి ఏడాదీ థియేటర్ల వద్ద ఆయన పుట్టినరోజు వేడుకలు ఓ రేంజ్‌లో జరుగుతాయి. అయితే ఆగస్టు 9న జరగనున్న మహేష్ 51వ పుట్టినరోజు వేడుకలు మరింత క్రేజీగా, ఎవరూ ఊహించని స్థాయిలో మోత మోగిపోనున్నాయి. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ.. 2011 నాటి ఇండస్ట్రీ హిట్ అండ్ కల్ట్ బ్లాక్‌బస్టర్ 'దూకుడు' సినిమాను సరికొత్త 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు.

ఈ 'దూకుడు' రీ-రిలీజ్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 1 సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలైంది. 2011లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'దూకుడు' అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మహేష్ బాబు స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్స్, సమంతతో కెమిస్ట్రీ, బ్రహ్మానందం కామెడీ ట్రాక్, థమన్ సంగీతం కలిసి ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి. టీవీలో ఎన్ని సార్లు ప్రసారమైనా ప్రేక్షకులు ఇప్పటికీ అదే ఆసక్తితో చూసే చిత్రాల్లో 'దూకుడు' ఒకటి నిలిచింది..

ఇటీవల స్టార్ హీరోల పాత చిత్రాల రీ-రిలీజ్‌లు భారీ వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో 'దూకుడు'పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే పలుచోట్ల ఫ్యాన్స్ ప్రత్యేక షోలు, భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే అనేక షోలు హౌస్‌ఫుల్ కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 7, 2027 విడుదల లక్ష్యంగా రూపొందుతుంది. ఈ సినిమాపై వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

ఒకవైపు 'దూకుడు' రీ-రిలీజ్ సందడి... మరోవైపు రాజమౌళి సినిమాపై భారీ హైప్... దీంతో ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు సాధారణ వేడుకలుగా కాకుండా ఫ్యాన్స్ కు నిజమైన సినీ మహోత్సవంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..