కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలపై భారం: మంత్రి వివేక్

కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలపై భారం: మంత్రి వివేక్

 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు పూర్తిగా పనికిరాకుండా పోయిందని మండిపడ్డారు.  పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు సందర్శించారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి  మాట్లాడుతూ..కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలపై తీవ్రమైన భారం పడిందని, ఆయన ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. ఇప్పటివరకు దాదాపు రెండు వేల టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా, కేసీఆర్ తప్పుడు విధానాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. దివంగత కాకా వెంకటస్వామి కలల ప్రాజెక్టైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్లే నేడు ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా రాష్ట్రంలో సాగునీటి రంగం, భవిష్యత్ ప్రణాళికలు , ప్రాజెక్టుల నిర్వహణపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.