ఆఫీస్ క్యాంటిన్ మూసేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం తీసుకోండి : టాప్ టెక్ కంపెనీ ఆర్డర్స్

ఆఫీస్ క్యాంటిన్ మూసేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం తీసుకోండి : టాప్ టెక్ కంపెనీ ఆర్డర్స్

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఇప్పుడు ఐటీ దిగ్గజాలపై కూడా ప్రభావం చూపుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఆఫీసు క్యాంటీన్లలో వంటలు వండటం కష్టంగా మారడంతో.. ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. చెన్నైలోని తన ప్రధాన కార్యాలయానికి చెందిన సిబ్బందిని మార్చి 12, 13 తేదీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తూ కంపెనీ ఆదేశించింది.

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనివల్ల భారత్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల లభ్యత భారీగా తగ్గింది. హెచ్‌సీఎల్ టెక్ కార్యాలయంలో ఆహారాన్ని సరఫరా చేసే వెండర్లకు తగినంత గ్యాస్ దొరకకపోవడంతో వారు కిచెన్స్ నిర్వహించలేకపోయారు. దీంతో ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు ఆహారం విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. కంపెనీ యాజమాన్యం తాత్కాలికంగా ఇంటి నుండే పనిచేయాలని సూచించింది. గ్యాస్ కొరత తీవ్రత కారణంగా క్యాంటీన్ సేవలు పూర్తిగా స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

కేవలం హెచ్‌సీఎల్ మాత్రమే కాదు.. దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ఇదే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బెంగళూరు, పూణే, చెన్నై క్యాంపస్‌లలో ఫుడ్ కోర్ట్ సేవలకు అంతరాయం కలగవచ్చని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది. ఎల్‌పీజీ కొరత వల్ల లైవ్ కౌంటర్లలో వేడివేడి దోశలు, ఆమ్లెట్లు వంటి పదార్థాల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పరిమితమైన మెనూను మాత్రమే అందుబాటులో ఉంచుతామని, అవసరమైతే బయటి సెంట్రల్ కిచెన్ల నుండి వండిన ఆహారాన్ని తెప్పిస్తామని పేర్కొంది.

ప్రస్తుత సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఎలక్ట్రికల్ వంట పరికరాలు, బయో ఇంధనం వాడకాన్ని పెంచాలని చూస్తున్నాయి. అయినప్పటికీ వేలాది మంది ఉద్యోగులు ఉండే క్యాంపస్‌లలో గ్యాస్ లేకుండా వంట చేయడం సవాలుగా మారింది. మొత్తానికి, యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని సెగ మాత్రం భారతీయ టెక్కీల ప్లేటు వరకు చేరింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడుతుండగా.. ఇప్పుడు ఐటీ కంపెనీలు ఏకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలు ఈ పరిస్థితులను ఊహించి ఇప్పటికే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి.