Iran War To Impact IPL: ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం కారణంగా మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2026 పై తీవ్ర ప్రభావం పడింది. ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2026 తొలి విడత షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 28న టోర్నీ ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 12వ తేదీ వరకు జరిగే తొలి 20 మ్యాచ్‌ల వివరాలను ప్రకటించింది.
విదేశీ ప్లేయర్స్ రాకపై ఎఫెక్ట్:
కాగా ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల విదేశీ ఆటగాళ్ల రాకపై సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు కూడా యుద్ధ ప్రభావం కారణంగా కొద్ది రోజుల పాటు భారత్‌లోనే చిక్కుకుపోయాయి. మార్చి 10న ఈ రెండు టీమ్స్ స్వదేశాలకు వెళ్లాయి. అలాగే ఈ యుద్ధం మూలంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కొన్ని నగరాల్లో హోటళ్లు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఐపీఎల్ టోర్నమెంట్ పై ప్రభావం పడుతుందా అనే సందేహాలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్:
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని తేల్చి చెప్పారు. మేము ప్రస్తుతం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేశాం.. మిగతా మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆయా రాష్ట్రాల ఎలక్షన్స్ డేట్స్ ని ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఐపీఎల్ మాత్రం నిర్ణయించిన సమయానికే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బీసీసీఐకి చెందిన మరో అధికారి మాట్లాడుతూ.. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందన్నారు. హోటళ్లు, ఎయిర్‌లైన్స్ లేదా ఇతర విభాగాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆందోళనలు వ్యక్తం కాలేదు అన్నారు. అయినప్పటికీ బీసీసీఐ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు.
ఆర్సీబీ – ఎస్ఆర్‌హెచ్ తొలి మ్యాచ్:
ఇక ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
10 వేదికల్లో తొలి 20 మ్యాచ్‌లు:
ఐపీఎల్ తొలి విడతలో మొత్తం 20 మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లోని 10 వేదికల్లో జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు.. మధ్యాహ్న మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుండగా.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
