అమెరికాలో స్థిరపడి.. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయులకు మారిన వీసా రూల్స్ శాపంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో సొంత ఊరికి వచ్చి.. తిరిగి అమెరికా వెళ్లలేక వీసా అపాయింట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న ఎందరో భారతీయుల ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా రెడిట్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక భారతీయ మహిళ వర్క్ వీసా హోల్డర్లు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు అద్దం పడుతోంది.
సదరు మహిళ తన తల్లికి తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు తెలియగానే.. అమెరికా నుంచి అత్యవసరంగా భారత్‌కు చేరుకుంది. పని ముగించుకుని తిరిగి వెళ్దామనుకునే లోపు.. అమెరికా పాస్‌పోర్ట్ స్టాంపింగ్ కోసం వీసా ఇంటర్వ్యూ స్లాట్లు దొరక్కపోవటంతో ఆమె ఇక్కడే చిక్కుకుపోయింది. కొద్దిరోజుల పర్యటన కాస్తా.. భారీ నిరీక్షణగా మారింది. అమెరికాలో ఆమెకు మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, కారు ఉన్నాయి. కానీ ఇక్కడ వీసా అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆమె కెరీర్, ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ALSO READ : యుద్ధంలోకి ఇరాన్ ఆత్మాహుతి దళాలు
ఈ అనిశ్చితి కేవలం మానసిక వేదననే కాకుండా.. తీవ్రమైన ఆర్థిక భారానికి కూడా దారితీస్తోందని ఆమె అన్నారు. ఆమె భౌతికంగా అమెరికాలో లేకపోయినా.. అక్కడ ఆమె కట్టాల్సిన ఇంటి మోర్టగేజ్ ఈఎంఐలు, పర్సనల్ లోన్ ఈఎంఐలు, ఇతర బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాల్సి వస్తోందని వాపోయింది. ఒకవేళ వీసా ఇంటర్వ్యూ త్వరగా దొరక్కపోతే.. అమెరికాలోని తన ఇంటిని అమ్మేయాలని కూడా ఆమె ఆలోచిస్తున్నట్లు రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, వీసా సమస్యల వల్ల చేజారిపోయే స్థితి రావడం అత్యంత బాధాకరం.
చాలామంది హెచ్-1బి వంటి వర్క్ వీసాలపై ఉన్నవారు విదేశాలకు వెళ్ళినప్పుడు, తిరిగి రావడానికి పాస్‌పోర్ట్‌పై చెల్లుబాటు అయ్యే వీసా స్టాంప్ తప్పనిసరి. అయితే ప్రస్తుతం అమెరికా కాన్సులేట్ల వద్ద అపాయింట్‌మెంట్లు పరిమితంగా ఉండటం, ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ అత్యవసరాల రీత్యా భారత్‌కు వచ్చే నిపుణులు, తిరిగి వెళ్లే మార్గం లేక తమ ఉద్యోగాలను, ఆస్తులను కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. వీసా నిబంధనల సంక్లిష్టత ప్రవాసుల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తోందో ఈ ఘటన కళ్లకు కడుతోంది.
