
- జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు.. అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కారు చర్యలు
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్, కలెక్టర్ కన్వీనర్‌గా త్వరలో కమిటీలు
- అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తైన భూ యజమానులకు శాశ్వత హక్కులు?
- కొత్తగా భూముల గుర్తింపు, పంపిణీపైనా అసైన్డ్ కమిటీలు ఫోకస్
- అన్యాక్రాంతమైన భూములపైనా వీటి నిర్ణయమే ఫైనల్
- సీఎం రేవంత్ దగ్గరకు చేరిన ఫైలు.. త్వరలోనే డెసిషన్
- ఆమోదం పొందితే ఏండ్ల సమస్యకు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర సర్కారు ఫోకస్పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలో అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు సంబంధించి, అర్హులైనవారికి యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు కొత్తగా భూముల పంపిణీకి ఈ కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అన్యాక్రాంతమైన భూములపైనా అసైన్డ్ కమిటీల నిర్ణయమే కీలకం కానున్నది. ఈ మేరకు రెవెన్యూశాఖ రూపొందించిన ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది. అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తైన భూములకు హక్కులు కల్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో చేతిలో అసైన్డ్ పట్టాలు, మోకామీద భూమి ఉండి యాజమాన్య హక్కులు లేనివారు, రికార్డుల్లో భూమి ఉన్నా ఫీల్డ్‌లో లేక ఇబ్బందులు పడ్తున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అదే సమయంలో కొత్త భూముల గుర్తింపు, పంపిణీకి సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలిసి భూములు లేని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
చైర్మన్‌గా జిల్లా ఇన్‌చార్జి మంత్రి!
జిల్లా స్థాయిలో ఏర్పాటు కానున్న అసైన్డ్ కమిటీలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా వ్యవహరించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. జిల్లాలోని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు అసైన్డ్ భూముల సమస్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయి. కొత్తగా ఏర్పడనున్న అసైన్డ్ కమిటీల విధులను కూడా ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లో ప్రభుత్వానికి చెందిన మిగులు భూములను గుర్తించి, అర్హులకు పంపిణీ చేయడం, ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా పర్యవేక్షించడం వీటిలో ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ఈసారి ఏర్పాటు చేయబోయే అసైన్డ్కమిటీల ద్వారా ప్రభుత్వ భూముల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.
కాగా, సీఎం ఆమోదం తర్వాత అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి విధివిధానాలపై స్పష్టత రానున్నది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో అసైన్డ్ కమిటీలను రద్దు చేసి, ఆ అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అసైన్డ్ భూములు కబ్జా అయినప్పుడు అమ్మినవారికి, కొన్నవారికి నోటీసులు జారీ చేసి, ఆయా భూములను ప్రభుత్వమే తిరిగి స్వాధీనం చేసుకొని.. నిరుపేదలకు ఉంటే తిరిగి ఇవ్వాలనే నిబంధన గతంలోనూ ఉన్నా వివిధ కారణాల వల్ల అది అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న కమిటీల ద్వారా ఈ సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.
కొత్తగా పంపిణీ.. నోటరీలపై మారిన అసైన్డ్ భూములు
అసైన్డ్ కమిటీల ఏర్పాటు తర్వాత ఆయా జిల్లాల్లో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇందుకోసం సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను అర్హులైన పేదలకు కేటాయిస్తారు. మరోవైపు కొన్ని దశాబ్దాల క్రితం అసైన్డ్ చేసిన ప్రాంతాలు అప్పట్లో వ్యవసాయ భూములు కాగా, ప్రస్తుతం పట్టణాలు, వాణిజ్య కేంద్రాలుగా మారాయి.
ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఇతర ప్రధాన నగరాల శివార్లలోని అసైన్డ్ భూముల విలువ కోట్లలో పలుకుతున్నది. దీంతో అసైన్డ్ భూముల చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. భారీ ఆర్థిక లావాదేవీలు జరుగుతుండడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. రికార్డుల్లో ఒకరు ఉంటే ఫీల్డ్‌లో మరొకరు ఉంటున్నారు. చాలాచోట్ల ఎలాంటి అధికారిక లావాదేవీలు జరగకపోయినా వేరేవాళ్ల చేతుల్లోకి అసైన్డ్ భూములు వెళ్లాయి. మరికొందరు తండ్రులు, తాతల నుంచి వచ్చిన అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదారుపాస్ బుక్స్ లేవు. బుక్కులు ఉన్నవారికి అసైన్డ్ భూములపై హక్కులు లేవు.
దీంతో ఈ సమస్యలన్నింటికీ అసైన్డ్ కమిటీలతో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విడతలవారీగా పేదలకు ప్రభుత్వ భూములను అసైన్డ్ చేసింది. ఆయా భూములను అవసరాలకు అమ్ముకుంటుండడంతో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం –1977ను తీసుకొచ్చింది. దీని ప్రకారం అసైన్డ్ చట్టం కింద భూమిని పొందిన యజమాని మినహా.. మరెవ్వరికీ దానిపై అధికారం ఉండదు. విక్రయం, దానం, బహుమతి ఇవ్వడానికి కూడా వీలుండదు. కానీ ఈ చట్టం విక్రయాలను ఆపలేదు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని చాలా మంది అసైన్డ్ భూములను తక్కువ రేట్లకు కొన్నారు. నోటరీలు, తెల్ల కాగితాలు రాసుకొని కొనుక్కున్నారు. అసైన్డ్ భూములు కొన్నవారిలో పేదలు కూడా ఉన్నారు. దీంతో ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాలు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 5.36 లక్షల ఎకరాల భూములకు ఇంకా డిజిటల్ సైన్ కాలేదు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 1.77 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.31 లక్షల ఎకరాలు, మెదక్‌లో 1.49 లక్షల ఎకరాలు, నల్గొండలో 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌లో 1.31 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి .కాలక్రమేణా చాలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొందరు ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నా, క్షేత్రస్థాయిలో వారికి భూమి లేదు.
2022 మే 6న వరంగల్‌లో జరిగిన రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోడు రైతులు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతోసహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీకి తగ్గట్టుగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తయిన భూములకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. యాజమాన్య హక్కుల కల్పన విషయంలో ఇతర రాష్ట్రాల్లోని విధానాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. కర్నాటకలో 15 ఏండ్లకు, తమిళనాడులో 20 ఏండ్లకు, కేరళలో 25 ఏండ్లకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తుండగా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పదేండ్లకే ఈ హక్కులు లభిస్తున్నాయి.