యూట్యూబర్: ఇంటి పనులతో ఇంగ్లిష్..! లక్షల్లో ఆదాయం..

యూట్యూబర్: ఇంటి పనులతో ఇంగ్లిష్..! లక్షల్లో ఆదాయం..

అది మహిళలు ఎదగడానికి పెద్దగా అవకాశాలు లేని మారుమూల పల్లెటూరు. భర్తకు యాక్సిడెంట్‌‌ కావడంతో కుటుంబ భారం మొత్తం తనే మోయాల్సి వచ్చింది. అయినా యశోద వెనకడుగు వేయలేదు. ఇంట్లో ఉండి, తన పనులు చేసుకుంటూనే అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించింది. రూపాయి.. రూపాయి కూడబెట్టుకుని స్మార్ట్‌‌ ఫోన్‌‌ కొనుక్కుంది. 

యూట్యూబ్‌‌లో క్లాస్‌‌లు విని ఇంగ్లిష్‌‌ నేర్చుకుంది. కొన్నాళ్లకు తనే సొంతంగా చానెల్‌‌ పెట్టి, పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. గ్రామీణ వాతావరణంలో వీడియోలు చేస్తూ, సింపుల్‌‌గా ఇంగ్లిష్ నేర్పిస్తూ యూత్​ని ఆకట్టుకుంది. అలా లక్షల మంది ఫాలోవర్స్‌‌ని సంపాదించుకుని ఇన్​ఫ్లుయెన్సర్​గా ఎదిగింది. 

యశోద లోధి 1994లో ఉత్తరప్రదేశ్‌‌లోని కౌశాంబి జిల్లా సిరాతు గ్రామంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. వాళ్ల గ్రామంలో దాదాపు అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుంటారు. యశోద తల్లిదండ్రులు కూడా రైతులే. ఆమె హిందీ మీడియంలో 12వ తరగతి వరకు చదువుకుంది. కానీ, పేదరికం, కుటుంబ సమస్యల వల్ల పై చదువులకు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత స్కూల్‌‌ పిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది. 

అదే టైంలో తను ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ల పెళ్లికి ఇరువురి కుటుంబాలు ఒప్పుకోలేదు. చివరకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని యశోద సోదరుడు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. భర్త వైపు బంధువులు కూడా చేరదీయలేదు. అయినా ధైర్యం తెచ్చుకుని భర్తతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టింది. 

కుటుంబ భారాన్ని మోస్తూనే.. 

యశోద భర్త 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. రోజువారీ కూలీ పని చేసేవాడు. అతనికి వచ్చే రూ. 300తోనే కుటుంబాన్ని పోషించేవాడు. కానీ.. పెండ్లి జరిగిన రెండేండ్లకు 2019లో అతనికి యాక్సిడెంట్‌‌ జరిగింది.  దాంతో పనికి వెళ్లలేకపోయాడు. కుటుంబ భారం యశోదపైనే పడింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు విద్య, ఉద్యోగాలు, డిజిటల్ ప్రపంచానికి కొంత దూరంగా ఉంటారు. ఆమె కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. 

►ALSO READ | కొత్త తెలుగు సంవత్సరం2026 : వసంత నవరాత్రి ఉత్సవాలు  ఎప్పుడు ప్రారంభమవుతాయి.. పూజా విధానం ఇదే..! 

స్మార్ట్‌‌ఫోన్‌‌తో మొదలైన జర్నీ

యశోద ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో 2021 నవంబర్‌‌లో తన జీవితంలో మొదటి స్మార్ట్‌‌ఫోన్ కొన్నది. అదే ఆమెకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. మొదట్లో జీవితంలో ఎలాగైనా ఎదగాలనే కోరికతో యూట్యూబ్‌‌లో మోటివేషనల్ స్పీకర్ సందీప్ మహేశ్వరి వీడియోలు చూసేది. అప్పుడామెకు ‘‘ఇంటి నుంచే పని చేసి కుటుంబాన్ని పోషించవచ్చు” అని అర్థమైంది. అదే ఆలోచనతో ఇంగ్లిష్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇంటి పనులు చేస్తున్నప్పుడు కూడా ఇయిర్‌‌ఫోన్స్ పెట్టుకుని యూట్యూబ్‌‌లో ఇంగ్లిష్ ట్యుటోరియల్స్‌‌ వినేది. గంటల తరబడి ప్రాక్టీస్ చేసేది.  

ఇంగ్లిష్ విత్ డెహతి మేడం

తనమీద తనకు నమ్మకం కలిగాక 2022లో ‘ఇంగ్లిష్ విత్ డెహతి మేడం’ పేరుతో యూట్యూబ్‌‌ చానెల్‌‌ పెట్టింది. అప్పటినుంచి తను నేర్చుకుంటూనే ఎంతోమందికి ఇంగ్లిష్‌‌ నేర్పిస్తోంది. అందుకే వీడియోల్లో తరచూ ‘‘నేను టీచర్​ని కాదు, నేను కూడా ఒక లెర్నర్​నే” అని చెప్తుంటుంది. మొదట్లో ఆమె అప్‌‌లోడ్‌‌ చేసిన వీడియోలకు పెద్దగా రీచ్‌‌ రాలేదు. ఆ తర్వాత తన కష్టాలు, రూ. 300తో బతికిన రోజుల గురించి చెప్తూ ఒక వీడియో చేసింది. 

ఆ వీడియో వైరల్ అయ్యింది. అప్పటినుంచి చానెల్‌‌కు రీచ్‌‌ పెరిగింది. ఆమె టీచింగ్‌‌ స్టైల్‌‌ గ్రామీణ ప్రాంతాల యువతను బాగా ఆకట్టుకుంది. పొలం పని, కూరగాయలు కోయడం లాంటి ఇంటి పనులు, పిల్లలతో ఆడుకోవడం.. అన్నింటినీ లెసన్స్​గా మలిచి, కష్టమైన పదాలను సరళంగా వివరిస్తుంది. ‘‘ఇంగ్లిష్ అంటే భయం అక్కర్లేదు. మన భాషలానే నేచురల్‌‌గా మాట్లాడాలి” అని ఆమె చెప్పే మాటలు ఎంతోమంది గ్రామీణ మహిళల్లో  ధైర్యాన్ని నింపాయి. 

లక్షల్లో ఆదాయం

యశోద కష్టం వృథా కాలేదు. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ చానల్‌‌ను 3.91 లక్షల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ఇప్పటివరకు చానెల్‌‌లో 1100 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేసింది. వాటిలో మిలియన్​కుపైగా వ్యూస్ సాధించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కూడా 1.82 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమె సోషల్‌‌ మీడియా ద్వారా ప్రతి నెలా రూ. లక్ష వరకు సంపాదిస్తోంది. యూట్యూబ్‌‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే తన అప్పులన్నీ తీర్చుకుంది.