గజ్వేల్ తహసీల్దార్ ఇండ్లలో ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు

గజ్వేల్ తహసీల్దార్ ఇండ్లలో ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు

కరీంనగర్, వెలుగు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లలో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. కరీంనగర్ విద్యానగర్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసముండే అపార్ట్​మెంట్​తో పాటు జ్యోతినగర్‌‌‌‌‌‌‌‌లోని ఇండ్లలో సోదాలు నిర్వహించి సుమారు రూ.4 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వీటి విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కరీంనగర్ సిటీలోని విద్యానగర్, ముక్రంపుర పరిధిలో రెండు ఇండ్లు, ఒక అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్(6 ఫ్లాట్లు), నాలుగు ఓపెన్ ప్లాట్లు, పలు వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు రూ.11.90 లక్షల నగదు, రూ.4.20 లక్షల విలువైన బంగార నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల్లో ఎక్కువ భాగం శ్రవణ్ కుమార్ భార్య కమటం దీప్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండడం గమనార్హం. ఏసీబీ టీమ్ రాకను గమనించిన కుటుంబ సభ్యులు సుమారు రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌‌‌‌‌‌‌‌ను బయటకు విసిరినట్లు తెలిసింది. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు ఆ బ్యాగ్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకుని రికవరీగా నమోదు చేశారు.

జూనియర్ అసిస్టెంట్ నుంచి తహసీల్దార్ వరకు..
కరీంనగర్ జిల్లా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగంలో చేరిన శ్రవణ్ కుమార్, తరువాత ప్రమోషన్‌‌‌‌‌‌‌‌పై అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. అనంతరం అదే కార్యాలయంలో డీటీగా, ఉమ్మడి జిల్లా కలెక్టర్ల వద్ద సీసీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం గజ్వేల్ మండలంలో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. ఆయనకు బినామీల పేరిట పదుల ఎకరాల వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు.