టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్.. హైదరాబాద్‎లో అంబరాన్నంటిన సంబరాలు

టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్.. హైదరాబాద్‎లో అంబరాన్నంటిన సంబరాలు

టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్ నిలిచింది. 2026, మార్చి 8న గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‎ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‎లో రాణించి ఫైనల్ పోరును ఏకపక్షంగా మార్చి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఓవరాల్‎గా మూడుసార్లు (2007, 2024, 2026) టీ20 వరల్డ్ కప్‎ను టీమిండియా ముద్దాడింది. 

టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్‎లో కూడా అభిమానులు భారీ ఎత్తున విజయోత్సవ వేడులు నిర్వహించారు. యావత్ హైదరాబాద్ సంబరాల్లో మునిగిపోయింది. ట్యాంక్ బండ్, సచివాలయ పరిసరాల్లో అభిమానుల కేరింతలు అంబరాన్నంటాయి.

 జాతీయ జెండాలతో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేయడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు హోరెత్తాయి. వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ సర్కిల్‎లో కూడా యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. బాణా సంచా కాల్చి విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు. భారత్ మాతా కీ జై, జయహో భారత్ స్లోగన్స్‎తో హోరెత్తించారు.