- జేడీయూ సభ్యత్వం తీసుకున్న నిశాంత్ కుమార్
పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్.. ఆదివారం అధికారికంగా జేడీయూ సభ్యత్వం తీసుకున్నారు. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం నితీశ్కుమార్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా నిశాంత్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తగా తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. రాజ్యసభకు వెళ్లాలనేది మా నాన్న వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తానని తెపారు. కాగా, వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన నిశాంత్ కుమార్.. తన తండ్రి ఆశయ సాధన కోసం పార్టీలో చేరారు.
నితీశ్ కుమార్ ఎప్పుడూ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. అందుకే తన కుమారుడిని ఇన్నాళ్లూ దూరంగా ఉంచారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా, కార్యకర్తల కోరిక మేరకు నిశాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఆయన అనుమతించినట్లు తెలుస్తోంది. నిశాంత్ రాకను జేడీయూ సీనియర్ నేతలు స్వాగతించారు. మరోవైపు నిశాంత్ కుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా
వినిపిస్తున్నాయి.
