ఇప్పుడంటే ఇరాన్-ఇజ్రాయెల్ ఇలా బాంబులేసుకుంటున్నాయి గానీ ఒకప్పుడు ఎంత జాన్ జిగిరీ దోస్తులంటే..

ఇప్పుడంటే ఇరాన్-ఇజ్రాయెల్ ఇలా బాంబులేసుకుంటున్నాయి గానీ ఒకప్పుడు ఎంత జాన్ జిగిరీ దోస్తులంటే..

ఇరాన్, ఇజ్రాయెల్​ ఈ రెండూ మధ్య ప్రాచ్యంలో అరబ్ కాని దేశాలు. చుట్టూ ఉన్న అరబ్ దేశాల మధ్యలో ఇద్దరూ మైనారిటీ గుర్తింపు కలిగి ఉన్నారు. ఇరాన్ పర్షియన్, ఇజ్రాయెల్ జ్యూయిష్. ఈ దేశాల్లో మతం ఆధారిత గుర్తింపు చాలా బలంగా ఉంది. ఇరాన్‌‌‌‌లో షియా ఇస్లాం, ఇజ్రాయెల్‌‌‌‌లో జుడాయిజం ప్రభావం ఎక్కువ.

రెండూ చారిత్రకంగా లోతైన సంబంధాలు కలిగి ఉన్నాయి. 1979కి ముందు ఇరాన్ ఇజ్రాయెల్‌‌‌‌కు మిత్రదేశం. ఇరాన్ ఇజ్రాయెల్‌‌‌‌కు ఆయిల్ సరఫరా చేసేది. రహస్య సంబంధాలు ఉండేవి. ఇరాన్​ రివల్యూషన్ తర్వాత కూడా కొన్నాళ్లు సత్సంబంధాలు కొనసాగాయి. ఇవి బలమైన సైనిక శక్తి కలిగినవి. అణు సామర్థ్యం, మిస్సైల్ టెక్నాలజీలో అభివృద్ధి చెందాయి. ప్రాంతీయ ప్రభావం కోసం పోటీపడుతుంటాయి. 

• ఇరాన్‌‌‌‌లో ‘రెయిన్‌‌‌‌బో ఐలాండ్’ ఉంది. దీని అసలు పేరు హార్మూజ్ ఐలాండ్. ఇది పర్షియన్ గల్ఫ్‌‌‌‌లో ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌‌‌‌లో ఇరాన్ తీరం నుంచి సుమారు 8 కి.మీ. దూరంలో ఉంది. ఇది హార్మోజ్‌‌‌‌గాన్ ప్రావిన్స్‌‌‌‌లో భాగం. ఈ ద్వీపం పూర్తిగా ఉప్పు డోమ్ ఆకారంలో ఉంది. ఇక్కడ మట్టి, రాళ్లు, పర్వతాలు రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్ వంటి రంగుల్లో మెరిసిపోతాయి. ఇది ఐరన్ ఆక్సైడ్, క్లే, వాల్కానిక్ రాక్స్ వంటి వాటివల్ల వస్తుంది.

• ఇరాన్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్‌‌‌‌కు భిన్నంగా ఉంటుంది. ఇది పురాతన పర్షియన్ సౌర క్యాలెండర్ ఆధారంగా రూపొందింది. పురాతన పర్షియన్ (ఇరానియన్) నాగరికత నుంచి వచ్చింది. జోరోస్ట్రియన్ కాలం నుంచి (సాసానిడ్ యుగం) సౌర క్యాలెండర్ ఉపయోగిస్తున్నారు. ఇది ఇరానియన్ ఐడెంటిటీకి చాలా ముఖ్యమైనది. 1925లో ఇరాన్ పార్లమెంట్ దీన్ని అధికారికంగా అంగీకరించింది.

►ALSO READ | హార్మూజ్‌‌‌‌ ఎందుకంత కీలకం.. అక్కడేం జరుగుతోంది ? హార్మూజ్ జలసంధిని మూసేస్తే ఏమౌతుంది..?

• పురాతన కాలం నుంచి ఇరాన్‌‌‌‌లో ఖనాత్ అనే అండర్‌‌‌‌గ్రౌండ్ వాటర్ చానెల్స్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. ఇది ఎడారి ప్రాంతాల్లో నీటి సరఫరాకు గొప్ప ఆవిష్కరణ. 2016లో ‘పర్షియన్ ఖనాత్’ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌‌‌‌గా గుర్తింపు పొందింది. దీని నిర్మాణానికి 5- నుంచి10 సంవత్సరాలు పడుతుంది. కానీ, ఒక్కసారి తయారైతే 500ల సంవత్సరాలకు పైగా పని చేస్తుంది. క్రీ.పూ. సుమారు1000వ సంవత్సరంలో అకేమెనిడ్ సామ్రాజ్య కాలంలో పర్షియన్ ఇంజినీర్లు ఎడారి ప్రాంతాల్లో వ్యవసాయం, జనాభాను కాపాడటానికి దీన్ని అభివృద్ధి చేశారు.

• 2026 మార్చి నాటికి ఇరాన్‌‌‌‌లో మొత్తం 29 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఇందులో 26 కల్చరల్ సైట్స్, 3 నేచురల్ సైట్స్ ఉన్నాయి. ఈ జాబితాలో ఇరాన్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది.

• 1979 ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత ఇరాన్‌‌‌‌లో ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరా, వాడకం పూర్తిగా నిషేధించబడింది. కానీ, డిమాండ్ ఎక్కువ ఉండడంతో బ్లాక్ మార్కెట్ నడుస్తోంది. 

ఈ దేశంలో మరో దేశం !

• గత100 ఏళ్లలో చెట్ల సంఖ్య పెరిగిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి.1900లో అక్కడ చెట్లు చాలా తక్కువ. ఎక్కువ భాగం ఎడారి ఉండేది. ఓటోమన్ కాలంలో డీఫారెస్టేషన్ ఎక్కువగా జరిగింది.1948లో ఇజ్రాయెల్ స్థాపన సమయంలో ఫారెస్ట్ కవర్ సుమారు 2 శాతం మాత్రమే. ఇప్పుడు అది 8-8.5 శాతానికి పెరిగింది. జ్యూయిష్ సంప్రదాయంలో చెట్లు నాటడం పవిత్రం. ప్రపంచవ్యాప్త జ్యూయిష్ కమ్యూనిటీలు డొనేషన్స్ ద్వారా చెట్లు నాటిస్తారు.

• డెడ్ సీ (మరణ సముద్రం)లో ఈజీగా తేలిపోతాం. ఎందుకంటే ఆ నీటిలో ఉప్పు చాలా ఎక్కువ. తేలడం సులభమే, కానీ నీరు చాలా డెన్స్ కాబట్టి స్విమ్ చేయడం లేదా కాళ్లు కదిలించడం కష్టం. ఇంత ఉప్పు ఉండడం వల్ల చేపలు, మొక్కలు జీవించలేవు. చాలా చిన్న బ్యాక్టీరియా, మైక్రోబియల్ ఫంగస్ ఉంటాయి. పురాతన కాలం నుంచి ఇక్కడి మట్టి, నీరు స్కిన్ ప్రాబ్లమ్స్​ని తగ్గించడంలో ఉపయోగపడతాయని నమ్ముతారు. ఇందులోని ఒక్క చుక్క నీరు నోట్లో పడినా నోరు మండిపోతుంది. కళ్లలో పడినా చాలా ఇబ్బందికి గురవుతారు.

• 3,000 సంవత్సరాల క్రితంనాటి హీబ్రూ భాషను ఇప్పటికీ కొందరు మాట్లాడుతున్నారు. 1948లో ఇజ్రాయెల్ స్థాపన తర్వాత హీబ్రూ అధికారిక భాష అయింది. పూర్వం  హీబ్రూ అనేది పురాతన కాలంలో ఇజ్రాయెల్ ప్రజల వాడుక బాష. బైబిల్‌‌లో పాత నిబంధన ఎక్కువ భాగం హీబ్రూలోనే రాయబడింది. కానీ, క్రీ.శ. 2వ శతాబ్దం తర్వాత హీబ్రూ మాతృభాష మాట్లాడే వారు దాదాపు అంతరించిపోయారు. రోమన్ ఆక్రమణలు, యూదులు డయాస్పోరాలో చెదిరిపోవడం వల్ల హీబ్రూ మాట్లాడడం తగ్గింది. అంతరించిన మాతృభాష మళ్లీ మాట్లాడడం గ్రేట్ అని చెప్పొచ్చు.

►ALSO READ | ఇరాన్‌ను ఊహించని దెబ్బ కొట్టిన ఇజ్రాయెల్.. ఫస్ట్ టైం ఇరాన్ చమురు డిపోలపై అటాక్ !

• ప్రపంచంలో అతి పురాతనమైన వివెన్ బాస్కెట్ (నేత బుట్ట) ఇజ్రాయెల్ జుడియన్ ఎడారిలో కనుగొన్నారు. ఇది మట్టి పాత్రలు రాకముందు రాతి యుగానికి చెందినది. దీనికి సుమారు 25 గ్యాలన్లు (సుమారు 100 లీటర్లు) సామర్థ్యం ఉంది. దీన్ని ఇద్దరు వ్యక్తులు నేసినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వారిలో ఒకరు ఎడమచేతి వాటం కలవాడు.

• ప్రపంచంలో అత్యధిక మిల్క్ ఉత్పత్తి చేసే ఆవులు ఈ దేశంలో ఉన్నాయి. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న రికార్డ్. ఇజ్రాయెల్‌‌‌‌లో సంవత్సరానికి ఒక ఆవు సుమారు12,000 లీటర్లకుపైగా పాలు ఇవ్వగలదు. ఇజ్రాయెల్ హోల్‌‌‌‌స్టీన్ బ్రీడ్ ఈ రికార్డుకు ప్రధాన కారణం. ఇటీవల ఒక ఆవు సంవత్సరానికి18,208 లీటర్ల పాలు ఇచ్చి వరల్డ్ రికార్డ్‌‌‌‌కెక్కింది.

• ఇజ్రాయెల్‌‌‌‌లో అఖ్జివ్‌‌‌‌ల్యాండ్ అనే ఒక మైక్రోనేషన్ ఉంది. ఇజ్రాయెల్ ఉత్తర తీరాన నహారియా నగరం సమీపంలో లెబనాన్ సరిహద్దుకు దగ్గరగా మెడిటేరియన్ సముద్ర తీరంలో ఉంది. ఇది సుమారు 10,000 చదరపు మీటర్లు ఉంటుంది. అంటే ఒక చిన్న ఫుట్‌‌‌‌బాల్ గ్రౌండ్ సైజు విస్తీర్ణం అన్నమాట. ఎలీ అవివి అనే అతను1952లో ఆ ప్రాంతంలో స్థిరపడ్డాడు.

1970లో ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడి భవనాలను కూల్చివేయడానికి ప్రయత్నించింది. దానికి వ్యతిరేకంగా అతను ‘స్వతంత్ర దేశం’గా ప్రకటించి ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోర్టుకు తీసుకెళ్లాడు. 1972లో కోర్టు అతనికి 99 సంవత్సరాల లీజ్​కు ఇచ్చింది. కానీ, మైక్రోనేషన్ స్థాయిని అధికారికంగా గుర్తించలేదు. జెండా, జాతీయగీతం, పాస్​పోర్ట్ క్రియేట్ చేసుకున్నాడు. తనను ప్రెసిడెంట్​గా ప్రకటించుకున్నాడు. ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా చెప్పాడు. అవివి 2018లో 88 ఏండ్ల వయసులో చనిపోయాడు. తన భార్య రీనా అవివి మాత్రమే ఉంది. ప్రెసిడెంట్ పదవి ఖాళీగా ఉంది.